Lokesh Darbhar Secret: టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్ 70వ ప్రజాదర్బార్‌కు అనూహ్య స్పందన లభించింది. మంగళవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు గడిపిన ఆయన సుమారు 5 వేల ఫిర్యాదులు స్వీకరించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లోకేష్ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మొదట్లో ప్రతి రోజూ నిర్వహించగా, పని ఒత్తిడి పెరగడంతో ప్రస్తుతం వీలు చిక్కినప్పుడు మాత్రమే ప్రజాదర్బార్ జరుపుతున్నారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలు, కార్యకర్తల సమస్యలు విన్నారు. ఇంత భారీ సంఖ్యలో ఫిర్యాదులు రావడం చూసి లోకేష్ ఆశ్చర్యపోయారట. అందరూ దాన్ని లోకేష్ గొప్పతనంగా చూస్తున్న సమయంలో.. ఆయన మాత్రం అందుకు విభిన్నంగా ప్రతిస్పందించారు. ఒకే రోజు అన్ని ఫిర్యాదులు, అంతమంది ప్రజలు సమస్యలతో రావడం అంటే.. అది ముమ్మాటికీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల వైఫల్యం అని లోకేష్ భావిస్తున్నారు. ప్రజాదర్భార్ కార్యక్రమం అనంతరం.. లోకేష్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతిరోజూ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి, ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ సెల్ నిర్వహించాలి. దాంతో పాటూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరి నియోజకవర్గాల్లో వారు ప్రజాదర్బార్లు జరపాలి. కానీ ఈ కార్యక్రమాలు క్రమం తప్పాయి. దీంతో చిన్న చిన్న సమస్యలు కూడా లోకేష్ వద్దకు చేరుతున్నాయి. ఇవి స్థానికంగా పోలీసులు, అధికారుల సమన్వయంతో పరిష్కరించదగినవే. కానీ కింది స్థాయిలో ఎకోసిస్టమ్ లేకపోవడం వల్ల పైస్థాయి వరకు వస్తున్నాయని లోకేష్ గుర్తించారు. పార్టీ ఆదేశాలను పట్టించుకోని ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్, ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నిసార్లు గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు? ఎన్ని సమస్యలు టేకప్ చేశారు? వాటిలో ఎన్నింటిని పరిష్కరించారు? అనే వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
Also Read: Fee Reimbursement: ఆగని ఫీజు పోరు.. సగం బకాయిలు ఇవ్వాల్సిందేనని ఫతి డిమాండ్
ఇక సమావేశంలో ప్రత్యేకించి నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట నారా లోకేష్. సీనియర్ నేత మాలేపాటి సుబ్బానాయుడు మరణానికి స్థానిక ఎమ్మెల్యే సరిగా స్పందించలేదు సరికదా… పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి ఫరూక్‌లను తన కారులోనే కూర్చోబెట్టుని తీసుకెళ్లడం, ముందుగానే 50 కార్లను సుబ్బానాయుడు గ్రామానికి పంపి షో చేయడంతో.. కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని, కావ్యా కృష్ణారెడ్డి వ్యవహారం రెచ్చగొట్టే చర్యగా ఉందని లోకేష్ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారట. అదేవిధంగా సీనియర్ నేత కొనకళ్ల నారాయణపై కూడా యువనేత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ అరెస్టు సందర్భంలో కులం కార్డు వాడి డ్రామాలాడుతుంటే.. సరిగా స్పందించలేదని ఎత్తిచూపారట. పార్టీ సీనియర్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని, ప్రతిపక్షం తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు బలంగా తిప్పికొట్టాలని సూచించారట నారా లోకేష్. విజయవాడ ఎంపీ కేసినేని నాని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదం పరిష్కరించడంలో రాష్ట్ర అధ్యక్షుడు విఫలమయ్యారని కూడా లోకేష్ భావిస్తున్నారట. క్రమశిక్షణ కమిటీ కూడా కట్టడి చేయడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారట. సాధారణంగా ప్రశాంతంగా, సంయమనంతో ఉండే లోకేష్… సొంత పార్టీ నేతలకు ఈసారి తన ఉగ్రరూపం చూపించారట. ప్రజల సమస్యలు స్థానికంగానే పరిష్కరించే ఎకోసిస్టమ్ బిల్డ్ కావాలన్నది ఆయన ఆకాంక్ష. లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉందని పార్టీ నేతలను హెచ్చరించారట నారా లోకేష్.

