Lokesh Clarity To YCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తొలుత ఢిల్లీ పర్యటన విశేషాలను మీడియాతో పంచుకున్నారు మంత్రి లోకేష్. ప్రధాని నరేంద్ర మోదీతో రెండు గంటలకు పైగా జరిగిన సమావేశం తన జీవితంలో మరిచిపోలేనిదన్న లోకేష్… ప్రధాని సలహాలు తనకు స్ఫూర్తినిచ్చాయని, పొరపాట్లు సహజమని, మంచి హృదయంతో పనిచేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారని మోదీ చెప్పిన మాటలను ఆయన పంచుకున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం కంటే, ప్రజల హృదయాలకు చేరువయ్యేలా వాటిని అమలు చేయడం ముఖ్యమని లోకేష్ అభిప్రాయపడ్డారు.
లోకేష్ మాటల్లో రాజకీయ దూకుడు స్పష్టంగా కనిపించింది. వైసీపీ అధినేత జగన్‌పై కేసుల విచారణ కొనసాగుతుందని, తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చింది కక్షసాధింపు కోసం కాదని, సుపరిపాలన కోసమని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం, ఇతర అవకతవకలపై విచారణ జరుగుతుందని, తప్పు చేసినవారు చట్టం ముందు శిక్ష అనుభవించాల్సిందేనని లోకేష్ గట్టిగా చెప్పారు. రెడ్ బుక్‌లో తప్పు చేసినవారి పేర్లు ఉన్నాయని చెప్పి వైసీపీ నేతల గుండెల్లో మరోసారి బాంబు పేల్చారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో జరిగిన చర్చల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందిస్తామని హామీలు వచ్చాయని లోకేష్ తెలిపారు. విద్యారంగంలో సంస్కరణలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆసక్తి చూపారని, బ్రిటన్ మాజీ ప్రధానికి సంబంధించిన సంస్థతో నైపుణ్య విద్య కోసం చర్చలు జరిగాయని వెల్లడించారు. అయితే, వైసీపీ తీరుపై లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసినా, ఆ పార్టీ తీరు మారలేదని విమర్శించారు. “వైసీపీ సైకోలను తయారుచేసే ఫ్యాక్టరీగా మారింది” అని ఎద్దేవా చేశారు.
Also Read: Yogandhra 2025: ప్రపంచ రికార్డ్ బద్దలుకొట్టనున్న యోగాంధ్ర..
Lokesh Clarity To YCP: వైసీపీ అధినేత జగన్ ఇటీవల గుంటూరు రెంటపాళ్లలో చేపట్టిన పర్యటన రాజకీయ దుమారం రేపింది. 72 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 8 గంటల పాటు షో చేసిన జగన్… తన పరామర్శ యాత్రను బలప్రదర్శనగా మార్చడంపై విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ కార్యకర్తలు సత్తెనపల్లి, రెంటపాళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో “రప్పా రప్పా నరుకుతాం” వంటి హింసాత్మక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంపై లోకేష్ స్పందిస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలను ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక తయారు చేస్తున్నామని, కొందరు ఎమ్మెల్యేలు తమ పనితీరును మెరుగు పరచుకోవాలని, దానికి మూడు నెలల సమయం ఇస్తామని లోకేష్ తెలిపారు.
రాష్ట్రంలో సుపరిపాలన కోసం ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, వ్యక్తిగత కక్షల కోసం కాదని లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ గత పాలనలో తప్పు చేసినవారికి శిక్ష తప్పదని, చట్టం తన పని తాను చేస్తుందని ఆయన గట్టిగా చెప్పారు. ఏపీ రాజకీయ రణక్షేత్రంలో లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని, వైసీపీని రక్షణాత్మక ధోరణిలోకి నెట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.