Korutla Jagityala BJP

Korutla Jagityala BJP: కోరుట్ల, జగిత్యాల వైపు కమలనాథులు కన్నెత్తి చూడట్లేదా?

Korutla Jagityala BJP: జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపింది కమలం పార్టీ. కోరుట్లలో అయితే టైట్ ఫైట్ ఇచ్చి కాంగ్రెస్‌ని వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచారు బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్. ఇక జగిత్యాలలో పోటీ చేసిన భోగ శ్రావణి 43 వేల ఓట్లకు పైగా సాధించారు. జగిత్యాలలో బీజేపీ మూడో స్థానంలో నిలిచినప్పటికీ, కొన్ని గ్రామాలు, జగిత్యాల పట్టణంలో పలు చోట్ల ఆధిక్యత ప్రదర్శించడం కేడర్‌లో కొత్త జోష్ నింపింది. అదే జోరును పార్లమెంట్ ఎన్నికల్లో కంటిన్యూ చేస్తూ కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలలో స్పష్టమైన ఆధిక్యత సాధించింది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి సొంత నియోజకవర్గం అయినప్పటికీ, జగిత్యాల పరిధిలో కమలం పార్టీకే ఆధిక్యత లభించింది. కోరుట్ల నియోజకవర్గంలోనూ మంచి మెజారిటీ వచ్చింది. ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల పురోగతిని చూస్తే తమకు మంచి రోజులు వచ్చాయని సంబరపడ్డారు లోకల్ కమలనాథులు. అయితే, నేతలు మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లే విధంగా వ్యవహరిస్తున్నారట. కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అర్వింద్, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ తాను ఇక్కడకు తరచుగా వస్తానని, పార్టీని పటిష్టం చేస్తానని చెప్పారు. ఆయన ఎంపీ అయ్యాక ఒకటి రెండు సార్లు తప్ప కోరుట్ల, జగిత్యాల వైపు కన్నెత్తి చూసింది లేదట. కోరుట్లలో ఉన్న లోకల్ లీడర్లను ఖాతరు చేయడం లేదట. గత ఎన్నికల ముందు అనేక వ్యయప్రయాసల కోర్చిన సురభి నవీన్‌రావు లాంటి వాళ్లను పట్టించుకోకపోవడంతో సైలెంట్ అయ్యారట. ఆయన నియోజకవర్గానికి రాకుండా, తమకు లోకల్‌గా అండగా ఉండే లీడర్ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లడంతో కక్కలేక, మింగలేకపోతున్నారట కమలం క్యాడర్.

బీఆర్‌ఎస్ నుంచి కౌన్సిలర్‌గా గెలిచి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకున్న భోగ శ్రావణి, అప్పట్లో లోకల్ ఎమ్మెల్యేతో కయ్యం వల్ల బయటకు రావాల్సి వచ్చింది. తనకు అవమానం జరిగిందంటూ ఆమె రచ్చకెక్కడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. కారు దిగిన శ్రావణి కాషాయం కండువా కప్పుకుని ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. జగిత్యాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుని దాదాపు 25 శాతం ఓట్లను సాధించింది. కాస్తంత కష్టపడితే నెక్స్ట్ చాన్స్ వస్తుందని అంతా భావించారు. జగిత్యాలలో పొలిటికల్ సినారియోను తమకు అనుకూలంగా మార్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయని కూడా భావించారట క్యాడర్. ఏం జరిగిందో ఏమో, పార్లమెంట్ ఎన్నికల తర్వాత భోగ శ్రావణి క్రమంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించేశారట. పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల్లోనూ ఆమె పాల్గొనడం లేదట. నియోజకవర్గ నేతలకు, పట్టణ ముఖ్య నాయకులకు కూడా అందుబాటులో ఉండకుండా, ఒకవేళ కలిసినా ఎడమొఖం, పెడమొహంగా ఉంటున్నారట శ్రావణి. ఇలా నేతల మధ్య సఖ్యత లేకపోవడం, తమకేం పట్టనట్టుగా వ్యవహరించడం.

ALSO READ  BRS Activist Gelu Srinivas Arrest: మహా న్యూస్ పై దాడి చేసిన గెల్లు శ్రీనివాస్ అరెస్ట్..

Also Read: Revanth Reddy: 20 ఏళ్ల తర్వాత ఓయూకు సీఎం.. నేడు ఉస్మానియా యూనివర్శిటీకీ రేవంత్ రెడ్డి

ఇప్పుడిప్పుడే జగిత్యాలలో బలపడుతున్న కమలం పార్టీకి అడ్డంకిగా మారిందంటున్నారు ఆ పార్టీ సీనియర్లు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పెట్టిన ఖర్చులకు శ్రావణి లెక్కలు చూపలేదని, అడగడం వల్లనే ఇలా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారట కాషాయ కార్యకర్తలు. అదేం కాదు… ఎంపీ అర్వింద్‌తో తేడా రావడం, ఆయన పట్టించుకోకపోవడం, నియోజకవర్గంలో తనకు ప్రయార్టీ ఇవ్వకుండా ఇతర నేతలకు పదవులు ఇవ్వడం వల్లనే దూరం అయ్యారనే టాక్ కూడా నడుస్తోందట. గత ఏడాదిన్నరగా ఇలా టచ్ మీ నాట్ అన్నట్టు సాగిన వ్యవహారం తాజాగా మరో మలుపు తిరిగిందట. ఇన్నాళ్లు జగిత్యాలలోనే నివాసం ఉన్న శ్రావణి సడన్‌గా ఇక్కడ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చడంతో ఏం జరుగుతుందో క్యాడర్‌కు అంతుపట్టడం లేదట. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వెంట తిరిగిన చోటా మోటా నాయకులకు ఇది మింగుడు పడటం లేదట. సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించిన తరుణంలో నియోజకవర్గ ఇంచార్జి దూరం జరగడంపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయట జగిత్యాల పొలిటికల్ సర్కిల్స్‌లో.

ఇక పెద్దదిక్కుగా ఉంటాడనుకున్న ఎంపీ అర్వింద్ నెలలు గడుస్తున్నా జగిత్యాల జిల్లా వైపు చూడటం లేదట. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు, ఎంపీగా పోటీ చేసినప్పుడు తాము పని చేసామని, ఇప్పుడు తమకు లోకల్‌గా నేతలేని సందర్భంలో తమ మొహం కూడా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట క్యాడర్. అయితే, బీజేపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆసక్తికర చర్చ బయలుదేరిందట. కమలం పార్టీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యం కానీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇతర లోకల్ బాడీలను పట్టించుకోదనే టాక్‌ని ఆర్వింద్ నిజం చేస్తున్నారంటున్నారు పొలిటికల్ పండిట్స్. మరోవైపు, తమ ఎన్నికలు కాదు, పైగా లోకల్ లీడర్లు ప్రజాప్రతినిధులు అయితే లేనిపోని తలనొప్పులు అని వారు భావిస్తున్నారనే టాక్ కూడా నడుస్తోందట. మొత్తానికి, తమ ఎన్నికలు కాదు కాబట్టి తప్పించుకు తిరగాలనే ప్లాన్‌లో లీడర్లు ఉంటే, తప్పించుకు తిరుగువారు దండగ సుమతీ అని గొణుక్కుంటున్నారట క్యాడర్. ఆ నేతలు తమను గెలిపించిన లోకల్ నేతలను పట్టించుకుంటారా? ప్రజాప్రతినిధులను చేస్తారా? అనేది వేచి చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *