KNR Congress Politics: అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా గానీ కరీంనగర్‌లో కనీసం కార్పోరేటర్ గెలవడమే కష్టంగా మారింది. ఎప్పుడో 2004లో ఎమ్మెస్సార్ గెలిచిన తర్వాత కరీంనగర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరలేదు. సాక్షాత్తు ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్నా పార్టీ పునర్నిర్మాణంపై మాత్రం దృష్టి సారించడం లేదు. ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు, ఇన్‌చార్జ్ మంత్రి ఉత్తమ్ ఉన్నా క్యాడర్‌కి సమస్యలు వస్తే ఎవరి దగ్గరికి పోవాలో అంతు పట్టని బేతాళ సమస్యగా మారింది. అధికారం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా కనీసం మార్కెట్ కమిటీలను కూడా ఇప్పటివరకు నియమించుకోలేకపోయారు. ఎంపీ ఎన్నికలలో కొద్దిగా జోష్ కనబడినా ఇప్పుడు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది కాంగ్రెస్ పరిస్థితి. ఇద్దరు మంత్రులలో మంచికో చెడుకో ఒకరి దగ్గరికి పోతే మరొకరికి కోపం.
అడకత్తెరలో పోక చెక్కలాగా తయారైంది లీడర్ల పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పదమూడు స్థానాలలో సిరిసిల్ల, కరీంనగర్, హుజురాబాద్, జగిత్యాల, కోరుట్ల స్థానాలను మినహాయిస్తే ఎనిమిది స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. కరీంనగర్‌కి సమీపంలోని చొప్పదండి, మానకొండూర్‌లలో కాంగ్రెస్ నుండే ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం పార్టీ పుంజుకోలేకపోయిందంటే ఖచ్చితంగా నాయకత్వ లోపమే అని కార్యకర్తలే భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీ కార్డు నినాదంతో పురుమల్ల శ్రీనివాస్‌కి కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్‌లకు పోటీ ఇవ్వలేకపోయాడు శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు పార్టీ ఓటు బ్యాంకే తప్ప కాంగ్రెస్ అభ్యర్థి కష్టం, కృషితో వచ్చిన ఓట్లేమీ కాదని ఓ విశ్లేషణ.
తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికలలో కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీకి మంచి జోష్ వచ్చినా ఆ జోష్ నీరుకారిపోయింది. దీనికి కారణం కరీంనగర్ కాంగ్రెస్ అనాథగా మారిందని, నియోజకవర్గాన్ని పట్టించుకునే నాథుడే లేడని కాంగ్రెస్ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. కరీంనగర్ నుండి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కొమటిరెడ్డి నరేందర్ రెడ్డికి, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో సుడా ఛైర్మన్ పదవి వచ్చింది. తనకు మంత్రి పొన్నం ప్రభాకర్ సహకరించట్లేదని, పొన్నం కరీంనగర్ వచ్చినా ఆయనతో కార్యక్రమాలలో పాల్గొనడం లేదు నరేందర్ రెడ్డి. అలాగే కరీంనగర్ గ్రంథాలయ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి అనుంగు అనుచరుడు సత్తు మల్లేశం వచ్చినా, తాను సూచించిన వారికి పదవులు ఇవ్వలేదని పొన్నం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు వీరిద్దరి మధ్య సఖ్యతే లేదు. అలాగే కరీంనగర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పురుమల్ల శ్రీనివాస్ కూడా మంత్రి పొన్నంతో ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు.
Also Read: Kavitha vs Harish Rao: అన్నాచెల్లెళ్ల ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరిందా?
KNR Congress Politics: కాగా, జిల్లాలు వేరైన తర్వాత మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లాకి పరిమితమయ్యారు. పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉండడంతో కరీంనగర్ జిల్లా కేంద్రంపై ఆయన కూడా ఫోకస్ పెట్టడం లేదు. ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా కొనసాగిన శ్రీధర్ బాబు నియోజకవర్గంలో విస్తృతమైన సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆ చనువుతోనే మంత్రి శ్రీధర్ బాబు దగ్గరికి వెళితే శ్రీధర్ బాబు వర్గీయులుగా, ఎంపీగా ఉన్నప్పుడు ఏడు నియోజకవర్గాలలో పొన్నం క్యాడర్ ఉండడంతో ఆయన వద్దకు వెళితే పొన్నం క్యాడర్‌గా ముద్రలు వేస్తున్నారని కార్యకర్తలే వాపోతున్నారు. మరోవైపు జిల్లాలోని ఎమ్మెల్యేలు కూడా ఏ మంత్రి దగ్గరికి పోతే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని తెగ భయపడిపోతున్నారట. ఇప్పటికే మూడుసార్లు పార్లమెంటుకు, నాలుగుసార్లు అసెంబ్లీకి వరుసగా ఓడిపోతూ వస్తున్నది కాంగ్రెస్. కార్పొరేషన్ ఎన్నికలు సమీపంలో ఉండడంతో కనీసం ప్రభావం చూపుతామా అన్న భయం వెంటాడుతోంది.
గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంచి సంబంధాలు ఉన్న నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్… బీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో కొంతకాలం నుండి ఆయన సైలెంట్‌గా ఉన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దిక్కుదివానా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఏదో ఒక ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారట. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా కలిసి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారట. కరీంనగర్ కాంగ్రెస్ మార్పు కోసం ప్రయత్నాలు చేయాలని, పార్టీని బలంగా తయారు చేయాలని అనుకున్నారట. మొదటి నుండి కాంగ్రెస్‌ని నమ్ముకున్న వారికి నామినేటెడ్ పదవులు ఇప్పించడమే కాకుండా, గెలిచే అవకాశం ఉన్న వారందరినీ మేమున్నామని ప్రోత్సహించాలని అనుకున్నారట. కరీంనగర్ నియోజకవర్గం దయనీయ పరిస్థితిని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్లి బలోపేతంపై చర్చించాలని సీనియర్లు అనుకోవడమే కాకుండా, ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు తొలగించి సయోధ్య కుదర్చాలని మొరపెట్టుకోవాలని నిర్ణయించుకున్నారట. అయితే, ఈ సీనియర్ నాయకుల సయోధ్య, బలోపేతం రాగం ఒక కొలిక్కి వస్తుందో, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కరీంనగర్ కాంగ్రెస్ వ్యవహారం ఉంటుందో వేచి చూడాలి మరి.