KCR: తెలంగాణ ఉద్యమ సమయంలో అత్యంత సాధారణంగా ఉన్న కేసీఆర్ కుటుంబం.. పదేండ్లు అధికారం అనుభవించిన తర్వాత మాత్రం వారి ఆదాయం వెయ్యి రెట్లు ఎలా పెరిగింది? దేశంలో ఏ పార్టీకి లేనంత బ్యాంక్ బాలెన్స్ ఎక్కడ నుండి వచ్చింది? పదేండ్ల ఉద్యమం, పదేండ్ల అధికారంలో ఉన్నంత మాత్రాన ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించడం ఎలా సాధ్యమైంది? కేసీఆర్‌కు బీదర్‌లో డబ్బులు ప్రింట్ చేసే స్థావరం ఉంది కాబట్టే ఇది సాధ్యమైందని సాక్షాత్తు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అంటేనే.. ఒంటి కాలుపై లేసే బండి సంజయ్.. బీఆర్ఎస్ అధినేతపై కరీంనగర్ కేంద్రంగా సంచలన వ్యాఖ్యలు చేసారు.
బీదర్‌లో బీఆర్ఎస్ అగ్రనేతకు ప్రింటింగ్ ప్రెస్ ఉండేదని, ఆ ప్రింటింగ్ ప్రెస్‌లో బీఆర్ఎస్ కరపత్రాలు కాకుండా దొంగనోట్లు ముద్రించారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేసారు. ఈ విషయాన్ని గతంలో సిద్దిపేటలో ఎస్పీగా పనిచేసిన ఓ ఆఫీసర్ తనకి చెప్పాడని బండి సంజయ్ అన్నారు. ఆ ప్రింటింగ్ ప్రెస్‌ని సీజ్ చేయడానికి వెళ్తుంటే… రాష్ట్రంలోని ఓ ముఖ్య నాయకుడు తనని ఆపారన్న విషయాన్ని కూడా ఆ అధికారి తనకు చెప్పినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. అంతేకాదు, ఉద్యమం తరువాత ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగ నోట్లేనన్నారు. అప్పుడు ఆ నోట్లు ఎలా చెలామణి అయ్యాయో అని అనుమానం వ్యక్తం చేసారు.
KCR: ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలన్నీ కూడా కాస్ట్లీ ఎన్నికలుగా మారాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. ఏ ఎన్నిక జరిగినా కోట్ల రూపాయలు ఖర్చు చేయనిదే గెలవలేం అనే ధోరణికి వచ్చేసారు నేతలంతా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో.. ఒక్కో ఎమ్మెల్యే గెలవాలంటే వందల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్యం ఏరులై పారింది. ప్రతి ఇంటికి డబ్బుల పంపిణీ జరిగింది. ఇక కార్యకర్తలు, ముఖ్య నేతలకు పెద్ద మొత్తంలో డబ్బులు అందజేసిన పరిస్థితి ఏర్పడింది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ విషయాల్లో మిగతా పార్టీలకన్నా ముందంజలో ఉంటుంది. ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఖర్చు చేసింది. ఈ డబ్బంతా.. బీఆర్ఎస్ ప్రింటింగ్ ప్రెస్ నుండి వచ్చిన దొంగ నోట్ల కట్టలే అనేది బండి సంజయ్ ఆరోపణల వెనుక ఉన్న అర్థం.
అయితే ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ కూడా ఘాటుగానే స్పందించింది. కరీంనగర్లో ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బండి సంజయ్ మాటల్ని కొట్టిపారేశారు. బండి సంజయ్ ఓ సన్నాసి అని… ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాట్లాడారు కేటీఆర్. ఆయన కేంద్ర మంత్రి కదా… విచారణ చేయొచ్చు కదా.. అంటూ ఎదురుదాడికి దిగారు. ఇక ఈ వ్యాఖ్యలు కరీంనగర్ కేంద్రంగా జరగడంతో ఇక్కడి నేతలు కూడా రంగంలోకి దిగారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: CAG Report: గతేడాది బడ్జెట్ అంచనాలో 79 శాతం ఖర్చు.. తెలంగాణ అసెంబ్లీలో కాగ్ నివేదిక
KCR: ఇక హైదరాబాదులోనూ దాసోజు శ్రవణ్ ఈ అంశంపై అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బండి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ నిరసన గళం వినిపించింది. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఘాటుగా స్పందిస్తూ… అన్ని వర్గాలు కేసీఆర్ వైపు చూస్తున్నాయని, దానిని డైవర్ట్ చేయడానికే బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మరో వెర్షన్ తెరపైకి తెచ్చారు.
మొత్తానికి ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగిపోలేదు. దొంగ నోట్ల వ్యవహారానికి సంబంధించి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు విమర్శలపై పేపర్లో వచ్చిన వార్తను బీజేపీ సోషల్ మీడియాలో ఉంచింది. అంతేకాదు అప్పట్లో మాజీ పోలీసు అధికారి ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా సోషల్‌మీడియాలో విడుదల చేసింది. వీటిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ కూడా సోషల్ మీడియా వేదికగా బండి సంజయ్‌పై విమర్శలు చేస్తోంది. ఇక ఒకరిపై ఒకరు సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులకు దిగుతున్నారు. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ దొంగనోట్ల వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో చూడాల్సి ఉంది.