Kavitha vs Jagadeesh: కవితను పార్టీ నుండి బయటకు పంపేందుకు రంగం సిద్ధమైందా? స్వయంగా కేసీఆరే అందుకు రంగం సిద్ధం చేస్తున్నారా? అందుకు ఆయుధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని కవితపైకి ఉసిగొల్పుతున్నారా? అధినేత కేసీఆర్ ఆదేశాలతోనూ జగదీష్ రెడ్డి కవితపై విమర్శలు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది? ఎక్కడిదాకా చేరింది? పరిశీలిస్తే సమాధానాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.
ఎలకతుర్తిలో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభతో కారు పార్టీలో కవిత చిచ్చు రాజుకుంది. సభ తర్వాత కేసీఆర్‌కు కవిత విమర్శలతో కూడిన లేఖ రాస్తే, అది కాస్తా లీక్ అయ్యింది. తన లేఖ లీక్ చేసింది ఎవరంటూ కవిత ఫైర్ అయ్యారు. కేసీఆర్ దేవుడే కానీ, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఒక్కడే తనకు నాయకుడంటూ… పార్టీలో మరెవరి నాయకత్వాన్ని తాను అంగీకరించనంటూ అన్న అజమాయిషీపై ఆనాడే పరోక్షంగా దెబ్బకొట్టారు కవిత. అటు నుంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాగానే.. కవిత సంబరాలు చేసుకున్నారు. ఆ దెబ్బకు బీఆర్‌ఎస్ నేతలు తలలు పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వివిధ ప్రాంతాలలో ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయంటూ తండ్రి పాలనపైనే బాణం ఎక్కుపెట్టారు. ఇలా ప్రతి సందర్భంలోనూ కవిత వాఖ్యలు తమ పుట్టి ముంచుతున్నాయంటూ లోలోపల గగ్గోలు పెడుతున్నారు బీఆర్‌ఎస్ నేతలు.
Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిందని అంటాడు..రూ.6000 కోట్లకు టెండర్లు..
బీఆర్‌ఎస్‌లో కవిత తిరుబాటు క్రమంగా ఏ రూపు తీసుకుంటోందో స్పష్టమవుతూనే ఉంది. తొలుత నర్మగర్భమైన వ్యాఖ్యలతో మొదలుపెట్టారు, తర్వాత పరోక్షంగా విమర్శలు గుప్పించడం స్టార్ట్ చేశారు, ఇప్పుడు నేరుగానే ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఇకపైనా ఆమె నేరుగానే విమర్శలు చేసే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ నేతలు భయపడుతున్నారు. దీంతో కవితను త్వరగా వదించుకోవాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ ఫామ్ హౌస్ చర్చలు ఊపందుకున్నాయట. అదనుచూసి కవితపై వేటు వేయాలని భావిస్తున్న గులాబీ బాస్.. అందు కోసం ఆయుధంగా తనకు అత్యంత ఆత్మీయుడైన జగదీష్ రెడ్డిని వాడుతున్నారని బీఆర్‌ఎస్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడు జగదీష్ రెడ్డి. కేసీఆర్‌తో అర్థరాత్రి వరకూ సమాలోచనలు, చర్చలు జరిపే సాన్నిహిత్యం ఉంది జగదీష్ రెడ్డికి. అటువంటి జగదీష్ రెడ్డి కేసీఆర్‌కు సమాచారం లేకుండా కవితపై విమర్శలు చేస్తాడా? అంటే.. చాన్సే లేదని బీఆర్‌ఎస్ వర్గాలే అంటున్నాయి. అంతేకాకుండా… కవితను ఇరిటేట్ చేసే విధంగా, ప్రస్టేషన్‌కు గురి చేసే విధంగా జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఆ ప్రస్టేషన్‌లోనే కవిత తాజాగా.. నల్గొండ లిల్లీపుట్ అంటూ జగదీష్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా కేటీఆర్ చెబితోనో, హరీష్ రావు చెబితేనో వినేవాడు కాదు జగదీష్ రెడ్డి. బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ మాత్రమే జగదీష్ రెడ్డిని కంట్రోల్ చేయగలడన్న టాక్ ఉంది. అంటే కవిత సంగతి తేల్చాలని సాక్షాత్తూ కేసీఆరే పూనుకున్నట్లు అర్థమవుతోంది. కవిత ఆటలు సాగేది కేసీఆర్ యాక్షన్‌లోకి దిగే వరకే అని బీఆర్‌ఎస్ నేతలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో కవిత రాజకీయాలు ఏ టర్న్ తీసుకుంటాయో వేచి చూడాలి.