Karregutta Kagar

Karregutta Kagar: మావోయిస్టు ‘విప్లవం’ సమాధి కానుందా?

Karregutta Kagar: మూడు రోజులుగా వేల సంఖ్యలో సాయుధ బలగాల దిగ్బంధంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలోని కర్రెగుట్టల్లో ఏం జరుగుతోందనే ఆందోళన తీవ్రమవుతోంది. వివిధ వర్గాల్లో హై టెన్షన్ నెలకొంది. బయటి సమాజంలో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కర్రెగుట్టల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులతో పాటు ముఖ్య నాయకులు ఉన్నారనే సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, డీఆర్జీ, కోబ్రా బలగాలతో పాటు ఛత్తీస్‌గఢ్ సాయుధ పోలీసులు పకడ్బందీ ప్రణాళికతో కర్రెగుట్టను చుట్టుముట్టారు. ఆపరేషన్ ‘కగార్’ పేరుతో ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర పోలీసులు చేస్తున్న ముప్పేట దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు.. రక్షణ కోసమో, సమావేశం కోసమో కర్రెగుట్టలకు చేరుకున్నారని సమాచారం.

ఈ నేపథ్యంలో సాయుధ బలగాలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్లను వినియోగిస్తూ గుట్టలపై బాంబులతో దాడి చేస్తున్నారు. మావోయిస్టులు అమర్చిన మందు పాతరలు, ఎల్‌ఈడీలను నిర్వీర్యం చేస్తూ బలగాలు చొచ్చుకుపోతున్నాయి. బాంబులు, తుపాకుల మోతతో కర్రెగుట్టలు దద్దరిల్లుతున్నాయి. సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు అక్కడే ఉంటూ బలగాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మావోయిస్టులు కూడా తుపాకులతో అడ్డుకుంటుండటంతో ఇరువైపులా కాల్పులతో ప్రాంతం ఉలిక్కిపడుతోంది. గ్రామాలతో సంబంధం లేకుండా రాకపోకలను నిలిపివేశారు. కర్రెగుట్టల్లో ఎంతమంది మావోయిస్టులు ఉన్నారనేది తెలియదు. కానీ వారు దిగ్బంధంలో ఉండటంతో పోలీసులతో తలపడటమో, లేక లొంగిపోవడమో తప్ప వేరే దారి లేని పరిస్థితి నెలకొంది. లొంగిపోయినా ప్రాణాలు దక్కుతాయా అనే అనిశ్చితి మావోలలో నెలకొంది.

2026 మార్చి 31 నాటికి మావోయిస్టు పార్టీని రూపుమాపడం లక్ష్యంగా కేంద్రం బ్రహ్మాస్త్రాలను వదిలింది. ఆపరేషన్ ‘కగార్’ పేరుతో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో అంతిమ యుద్ధం కొనసాగుతోంది. కొన్ని రోజుల క్రితం మావోయిస్టు పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని, భద్రతా దళాలను క్యాంపులకు పరిమితం చేయాలని, నెల రోజులపాటు సెర్చింగ్ ఆపరేషన్ ఆపాలని కోరింది. కానీ, జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు వివేక్ సహా ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఘటన తర్వాత కేంద్రం అప్రమత్తమై, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా మారిన కర్రెగుట్టల్లో వేల సంఖ్యలో భద్రతా దళాలు మొహరించాయి. సీఆర్పీఎఫ్, కోబ్రా, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ బలగాలు కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నాయి.

Also Read : Donald Trump: భారతదేశం-పాక్ మధ్య గొడవలు వారే పరిష్కరించుకుంటారు

Karregutta Kagar: ఆపరేషన్‌లో వాయుసేన కూడా రంగంలోకి దిగింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లకు అనుసంధానమైన దట్టమైన అటవీ ప్రాంతంతో, 53 కిలోమీటర్ల విస్తీర్ణంలో కర్రెగుట్టలు ఉన్నాయి. మావోయిస్టు ముఖ్య నేతలు, అనుచరులు ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్నారని పోలీసులకు ఉప్పందింది. విశ్వసనీయ సమాచారంతో కేంద్రం వేల సంఖ్యలో జవాన్లను మొహరించి సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. బడే చొక్కా రావు అలియాస్ దామోదర్, మాస్టర్ మైండ్ హిడ్మా, దేవ, వికాస్ వంటి కీలక నేతలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కర్రెగుట్టలకు ఉన్న అన్ని మార్గాలను చుట్టుముట్టి, మావోయిస్టులు తప్పించుకునే అవకాశం లేకుండా వాయుసేన సహకారంతో ఆపరేషన్ ‘కగార్‌’ దూకుడు పెంచింది. మాడ్వి హిడ్మా, ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పుర్వతి గ్రామంలో జన్మించాడు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడైన సభ్యుడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్ 1 కమాండర్‌గా పనిచేస్తున్నాడు. అతని బాధ్యతలను పటిరామ్ మాంఝీకి ఇచ్చినట్లు ప్రచారం జరిగినా, హిడ్మానే గెరిల్లా ఆర్మీని నడిపిస్తున్నాడని అంటారు. భద్రతా దళాలు బీజాపూర్ జిల్లా పూజారి కాంకేడ్ మీదుగా చొచ్చుకెళ్తూ హిడ్మాను టార్గెట్ చేస్తున్నాయి.

పచ్చని అడవిలో బందూక్‌ల గర్జన, భద్రతా బలగాల బూట్ల చప్పుళ్లతో కర్రెగుట్టలు దద్దరిల్లుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందనే భయంతో ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. చూడాలి మరి.. కర్రెగుట్ట ఆపరేషన్‌తోనే మావోల శకం ముగుస్తుందో.. లేక ఏం జరగబోతోందో?

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *