Kalahasti Chairman: ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన జనసేన కార్యకర్త కొట్టే సాయిప్రసాద్‌కి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఛైర్మన్ పదవి దక్కింది. నాడు వైసీపీ పాలనలో కొట్టే సాయిని నడి రోడ్డుపై అవమానించింది సీఐ అంజూ యాదవ్. ఆమెకు అప్పటి వైసీపీ ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉండటంతో చెలరేగి పోయారన్న ఆరోపణ ఉంది. ఆ క్రమంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజాస్వామ్యయుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్న కొట్టే సాయిని… అధికార గర్వం తలకెక్కిన సీఐ అంజూ యాదవ్.. అందరి ముందూ చెంపదెబ్బలు కొట్టింది. రెండు చేతులతో… సాయి రెండు చెంపలు కమిలిపోయేలా దాడి చేసింది అంజూ యాదవ్. ఆ దృశ్యం చూసిన ఎవరికైనా సరే.. ఆమెది విధి నిర్వహణ కాదని, వ్యక్తిగత ద్వేషంతోనో, కట్టలు తెంచుకున్న కోపంతోనో చేసిన దాడిలా ఉందని అర్థమవుతుంది. తన కార్యకర్తకి జరిగిన అవమానంపై పవన్ కళ్యాణ్ చలించిపోయారు. తానే స్వయంగా శ్రీకాళహస్తికి వచ్చి సాయిని పరామర్శించారు. సాయికి అండ నిలుస్తూ తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు పవన్ కళ్యాణ్. పోలీసుల వైసు నుండి సాయికి ఎలాంటి న్యాయం జరగలేదు. అయితే.. ఎక్కడైతే తన కార్యకర్తకు అవమానం జరిగిందో, అక్కడే తిరిగి తలెత్తుకు తిరిగేలా చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వంలో కీలక పదవిని సాయికి కట్టబెట్టారు. శ్రీకాళహస్తి టెంపుల్‌కి చైర్మన్ అంటే సామాన్యమైన విషయం కాదు. టీడీపీ, బీజేపీ నేతల నుండి ఎంత పోటీ ఉన్నా… పవన్ పట్టుబట్టి తన కార్యకర్త అయిన కొట్టే సాయికి ఆ పదవి దక్కేలా చేశారు.
Also Read: BRS: కవిత లోటును పూడ్చే పనిలో బీఆర్ఎస్.. కవిత స్థానం ఆమెకేనా?
జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి పవన్ కళ్యాణ్ బాటలో నడిచిన సామాన్య కార్యకర్త కొట్టే సాయి. అతడు ఆనాడు చేసింది ప్రజాస్వామ్య యుతమైన నిరసన. కానీ ఆయనపై సీఐ అంజు యాదవ్ చేసినది అత్యంత అమానవీయ దాడి. ఆమె కొడుతున్నా కదలకుండా అలాగే నిలుచుండిపోయిన కొట్టే సాయి ప్రదర్శించిన ఓర్పు, సహనం… జనసేన సిద్ధాంతాలను నరనరాన జీర్ణించుకున్న తిరుగులేని సంకల్పం. ఆ ఘటన జరిగిన రోజున తాడేపల్లిగూడెం సమావేశంలో ఉన్న పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించారు. ఆ తరవాత కొట్టే సాయిని, నాయకులను వెంటబెట్టుకొని తిరుపతి వెళ్ళి జిల్లా ఎస్పీని కలిసి పోలీసుల చర్యపై ఫిర్యాదు చేశారు. ఆ రోజు పోలీసులు కొట్టినా ప్రజాస్వామ్యయుతంగా, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిలిచిన కొట్టే సాయిని పవన్ కళ్యాణ్ గుర్తు పెట్టుకున్నారు. నేడు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించారు. పార్టీ కోసం నిలిచే కార్యకర్తలు, నాయకులను గుర్తించి తగిన బాధ్యతలు ఇచ్చే దిశగా పవన్ నిర్ణయాలు తీసుకొంటున్నారు అనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ.