Jagan and Google: విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్, ఏఐ హబ్ రాకతో ఏకంగా 1.2 లక్ష కోట్ల పెట్టుబడి లభించింది. దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ చర్చనీయాంశమై, కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిశాయి. సాధారణంగా ఇటువంటి భారీ పెట్టుబడులపై ప్రతిపక్షాలు హర్షిస్తాయి లేదా నిశ్శబ్దంగా ఉంటాయి. కానీ, వైసీపీ మాత్రం ఈ అంశంపై విరుద్ధ వాదనలతో రాజకీయం చేస్తోంది. ఒకవైపు గూగుల్ డేటా సెంటర్‌తో రాష్ట్రానికి ఉపయోగం లేదని, కేవలం 200 ఉద్యోగాలే వస్తాయని, నీటి సమస్య తలెత్తుతుందని, విద్యుత్ భారం పెరుగుతుందని విమర్శిస్తోంది. మరోవైపు, ఈ ప్రాజెక్ట్‌కు క్రెడిట్ జగన్‌కే దక్కాలని, జగన్ హయాంలోనే అదానీ డేటా సెంటర్ ప్రతిపాదనలు తెచ్చారని వాదిస్తోంది. ఈ రెండు విరుద్ధ వాదనలు వైసీపీ అభిమానులనే గందరగోళానికి గురిచేస్తున్నాయి. తప్పుడు ప్రచారంలోనూ ఒక స్థిరమైన స్టాండ్ తీసుకోలేక వైసీపీ సతమతమవుతోంది అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: PM Modi: ఈ 21వ శతాబ్దం మన భారతీయులదే
వాస్తవాలు ఏంటంటే, గూగుల్ డేటా సెంటర్‌లో అదానీ, ఎయిర్‌టెల్ సేవలు అందిస్తున్నాయి, కానీ యాజమాన్యంలో భాగస్వాములు కాదు. అదానీ గ్రీన్ ఎనర్జీ రంగంలో, ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ సేవల్లో గూగుల్‌కు సహకరిస్తున్నాయి. అంటే అవి రెండూ గూగుల్ కోసం పనిచేస్తాయి తప్ప పెట్టుబడులు పెట్టవు. ఇక అదానీ గతంలో ప్రతిపాదించిన డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. దీనికి గూగుల్ ప్రాజెక్ట్‌తో సంబంధం లేదు. మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్ట్‌ను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి, వైసీపీ సహకారం ఉంటే స్వాగతిస్తామని, కంపెనీలను తెచ్చేందుకు కలసి రావాలని హుందాగా కోరుతున్నారు. కానీ, వైసీపీ సోషల్‌మీడియా మాత్రం క్రెడిట్ జగన్‌కు ఇవ్వాలని గొంతెమ్మ కోరికలు కోరుతూ, తలతిక్క ప్రచారాలు చేస్తూ నవ్వుల పాలవుతోంది. అదే సమయంలో గూగుల్‌తో అంతా విధ్వంసమేనని, విశాఖ సముద్రం కూడా ఎండిపోయి ఎడారి అవుతుందని అర్థం పర్థం లేని వాదనలతో ప్రజల్ని భయపెట్టాలని దుష్ప్రచారాలు మొదలు పెట్టారు. ఈ గందరగోళ వైఖరి వైసీపీకి నష్టమే చేస్తోంది తప్ప ఏ ప్రయోజనం ఉండటం లేదు. రాష్ట్ర హితం కోసం అధికార, ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలని, విమర్శలు సహేతుకంగా ఉండాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు కానీ వైసీపీ వైఖరి మారదు.