Indravelli Massacre: ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి పేరు వింటే చాలు, అందరికీ గుర్తొచ్చేది ఒక్కటే: ఆదివాసీలు తమ హక్కుల కోసం చేసిన పోరాటం. జల్, జమీన్, జంగిల్ నినాదంతో ఐక్యమైన ఆదివాసీలు.. సరిగ్గా 44 ఏళ్ల క్రితం ఇదే రోజున పదుల సంఖ్యలో పోలీసుల తూటాలకు బలైపోయారు. అందుకే ఈ రోజును గుర్తు చేస్తే ఆదివాసీల్లో అంతటి సమరోత్సాహం. అప్పటి ఇంద్రవెల్లి నెత్తుటి గాయాలు నేటితో 44 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. 44 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఇంద్రవెల్లి స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటోంది. ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినాన్ని ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహించింది. ఆంక్షల నడుమ ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించడంపై 44 ఏళ్లుగా ఉన్న నిషేధం, నిర్బంధాలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా, అధికారిక నిర్వహణకు అవకాశం లేకుండా పోయింది. ఆదివాసీ అమరులకు సరైన గౌరవం దక్కాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో అధికారికంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరపాలన్న ఆదివాసీ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంతో గిరిజనులు స్వేచ్ఛగా నివాళులు అర్పించారు.
1981, ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది ఆనాటి గిరిజనం. భూమి కోసం, భుక్తి కోసం, నియంతృత్వ ప్రభుత్వం నుండి విముక్తి కోసం పోరాటానికి తుడుం మోగించింది. జల్, జంగిల్, జమీన్ అంటూ నినదిస్తూ ఎర్ర జెండా ఊపింది. ఈ పోరాటానికి అనుమతి లేదంటూ ఆనాటి ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేసింది. అవేమీ లెక్క చేయకుండా తుపాకీ తూటాలను సైతం ఎదుర్కొనేందుకు ‘మావనాటే మావ సర్కార్’ అంటూ నినదిస్తూ పోరు సలిపింది ఆనాటి ఆదివాసీ జనం. ఈ పోరాటంలో 13 మంది ఆదివాసీలు మరణించారని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య 100కు పైగా ఉంటుందని ఆదివాసీలు చెబుతుంటారు. ఆ కాల్పుల్లో అమరులైన ఆదివాసీల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి మండలం హిరాపూర్‌లో ఆదివాసీలు సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తుంటారు.
నాలుగున్నర దశాబ్దాల నిర్బంధం తర్వాత ఇంద్రవెల్లి స్వేచ్ఛ వాయువులు పీల్చుకొంది. ఇంద్రవెల్లి అమరుల త్యాగాలను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి, తొలిసారిగా సభను అధికారికంగా అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించడంతో అడవి బిడ్డల్లో ఉన్న భయం పోయి, స్వేచ్ఛతో తమ వారికి నివాళ్లు అర్పించారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద నెలకొన్న సందడిని చూసి అడవితల్లి పులకరించిపోయింది. ఇన్నాళ్లు మౌనంగా మూగబోయిన ఇంద్రవెల్లి చిందులేసింది. హిరాపూర్ గ్రామ సమీపంలో ఉన్న అమరవీరుల స్మారక స్థూపం వద్ద అసువులు బాసిన అమరవీరులకు ప్రజాప్రతినిధులు సైతం ఘనంగా నివాళులర్పించారు.
Also Read: YCP Visha Nagulu On USRA: ఎన్నారైలు అంటే వైసీపీకి ఎందుకంత ద్వేషం?
Indravelli Massacre: ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబ సభ్యులకు 10 లక్షల విలువ గల ట్రైకర్ యూనిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అమరవీరుల సంస్మరణ సభలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే ఒక కమిటీ ఏర్పాటు చేసి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆనాడు మరణించిన ఆదివాసి వీరులు తమ సొంత ప్రయోజనాల కోసం కాకుండా జాతి ప్రయోజనాల కోసం పోరాటం చేశారన్నారు.
అంతకుముందు, అమరులైన వీరులకు ఆదివాసీ గిరిజనులు ఘనంగా నివాళులర్పించారు. గోండుగూడ నుండి ప్రారంభమైన ర్యాలీ మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయబద్ధంగా పూజలు చేసి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల కుటుంబ సభ్యులతో పాటు గాయాలపాలైన బాధితులు తరలి వచ్చి నివాళులర్పించారు. వారి త్యాగాలను కొనియాడారు. సంస్మరణకు భారీ సంఖ్యలో గిరిజనులు తరలివచ్చారు. అమరవీరుల స్థూపం ఎదుట ఎరుపురంగుతో రెండు జెండాలను ఆవిష్కరించారు. మంత్రి సీతక్క, ఎంపీ నగేష్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ మహాజన్, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్, ఎమ్మెల్యేలు బొజ్జు పటేల్, కోవలక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎంపీ సోయం బాపురావుతో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

