Ind Operation Sindoor

Ind Operation Sindoor: భారత చరిత్రలో గుర్తుండిపోయే మైలురాయి!

Ind Operation Sindoor: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత 15 రోజుల్లోనే, భారత సాయుధ బలగాలు ‘ఆపరేషన్ సిందూర్’ను మంగళవారం అర్ధరాత్రి 1:05 గంటలకు ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ కేవలం 25 నిమిషాల్లో, అంటే 1:30 గంటలకు పూర్తయింది. భారత ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళం, గూఢచార సంస్థల సమన్వయంతో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌లో 4, PoKలో 5 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో 90 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో లష్కర్-ఎ-తోయిబాకు చెందిన ఇద్దరు కీలక కమాండర్లు… హఫీజ్ అబ్దుల్ మాలిక్, ముద్దసిర్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరూ భారత్‌పై జరిగిన దాడులకు సూత్రధారులుగా గుర్తించబడ్డారు.

ఈ ఆపరేషన్‌లో ధ్వంసమైన 9 స్థావరాల్లో… మూడు లష్కర్-ఎ-తోయిబా, నాలుగు జైష్-ఎ-మహమ్మద్, రెండు హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థలకు చెందినవిగా కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. మురిద్కేలోని మర్కాజ్ తోయిబా… 26/11 ముంబై దాడులకు శిక్షణా కేంద్రంగా ఉపయోగపడిన లష్కర్ కార్యాలయం. బహవల్పూర్‌లోని మర్కజ్ సుబాన్… జైష్-ఎ-మహమ్మద్ ప్రధాన కార్యాలయం. ఇది భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ. లోపల ఉంది. ముజఫరాబాద్‌లోని షవాయ్ నల్లాహ్… లష్కర్ శిక్షణ, నియామక కేంద్రం. సియాల్‌కోట్‌లోని మొహ్మూన్ జోయా… హిజ్బుల్ ముజాహిదీన్ శిబిరం. ఇది సరిహద్దుకు 15 కి.మీ. దూరంలో ఉంది. కోట్లిలోని మర్కాజ్ అబ్బాస్… 2023లో పూంచ్, రియాసీ దాడులకు సంబంధించిన హిజ్బుల్ స్థావరం. ఈ స్థావరాలు భారత్‌పై దాడులకు కుట్రలు పన్నడంలో కీలక పాత్ర పోషించాయి. ఖచ్చితమైన నిఘా సమాచారంతో ఈ దాడులను నిర్వహించింది భారత్‌. అదే సమయంలో పాక్‌ పౌరులు, పాక్ సైనిక స్థావరాలకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్త వహించింది.

‘సిందూరం’ భారత సంప్రదాయంలో మహిళల రక్షణ, గౌరవానికి చిహ్నం. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు మత ఘర్షణలను రెచ్చగొట్టేలా హత్యలు చేశారు. మహిళల పసుపుకుంకుమలు చెరిపేశారు. బాధిత మహిళలకు ఈ ఆపరేషన్ ద్వారా న్యాయం చేయడమే కాక, భారత గౌరవాన్ని నిలబెట్టే సంకేతంగా ఈ ఆపరేషన్‌కు ‘సిందూర్‌’ అనే పేరు ఎంచుకుంది భారత సైన్యం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షించారు. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ఇండియన్‌ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ, ఎయిర్‌ ఫోర్స్‌ విభాగానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ దాడి వివరాలను వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో ఖచ్చితమైన నిఘా సమాచారం, సమన్వయం కీలక పాత్ర పోషించాయని వారు తెలిపారు. అమరులైన అమాయక పర్యాటకులు, వారి కుటుంబాలకు న్యాయం చేయడానికి ఆపరేషన్ సింధూర్ ప్రారంభించినట్టుగా వెల్లడించారు. ముఖ్యంగా, ఇద్దరు మహిళా అధికారులు సోషియా ఖురీషీ, వ్యోమికా సింగ్‌లు ఈ ఆపరేషన్ వివరాలను వెల్లడించడం భారత సైన్యంలో మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచింది.

Also Read: BLA Attack on PAK Army: భారత దాడిలో ఉగ్రవాదులు మృతి.. బలూచ్ దాడిలో 12 మంది పాకిస్తాన్ సైనికులు మృతి

Ind Operation Sindoor: ఇక ఈ ఆపరేషన్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సినీ తారలు చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, సాయిధరమ్ తేజ్, రితేశ్ దేశ్‌ముఖ్, కుష్బూ సోషల్ మీడియా వేదికగా “జై హింద్” అంటూ సైన్యానికి మద్దతు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్, మంత్రి నారా లోకేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ చర్యను ప్రశంసించారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించి, రక్షణ చర్యలను పటిష్ఠం చేసేందుకు చర్యలు చేపట్టారు. అంతర్జాతీయంగానూ ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై స్పందనలు వెల్లువెత్తాయి.
ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్‌కు సంపూర్ణ మద్దతు తెలిపింది. అయితే, పాకిస్థాన్ మీడియా, పాక్‌ ప్రభుత్వ అనుబంధ సంస్థలు పరువు నిలుపుకునేందుకు తప్పుడు ప్రచారం చేస్తూ… భారత్‌పైనే క్షిపణి దాడులు చేశామని, శ్రీనగర్ ఎయిర్‌బేస్ ధ్వంసమైందని అసత్య ప్రచారాలు మొదలుపెట్టాయి. అయితే భారత్‌లోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ వాదనలను తిప్పికొట్టి, పాక్ ప్రచారంలో ఉపయోగించిన వీడియోలు పాతవి, సంబంధం లేనివని ఆధారాలతో సహా స్పష్టం చేసింది.

పాకిస్థాన్ ఈ దాడులను “యుద్ధ చర్య”గా చెబుతోంది. అయితే, భారత్ స్పష్టంగా తెలిపినట్లు, ఈ దాడులు పాక్ సైనిక స్థావరాలు లేదా పౌరులపై కాకుండా, కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే జరిగాయి. పాక్ దుష్ప్రచారం ఈ ఆపరేషన్‌ను వక్రీకరించే ప్రయత్నంగా కనిపిస్తోంది. పాక్‌ వాదనలు ఎలా ఉన్నప్పటికీ.. ‘ఆపరేషన్ సిందూర్’ ఉగ్రవాద వ్యతిరేక భారత దృఢ సంకల్పానికి నిదర్శనం. పహల్గామ్ బాధితులకు న్యాయం చేయడమే కాక, భారత సార్వభౌమత్వాన్ని పరీక్షించే వారికి గట్టి సందేశం ఇచ్చింది ఇండియన్‌ ఆర్మీ. దేశ ప్రజలు, నాయకులు, సైన్యం ఐక్యంగా నిలిచి, ఈ చర్యను సమర్థించారు. ఈ ఆపరేషన్ భారత చరిత్రలో ఒక గుర్తుండిపోయే మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు దేశమంతటా ఒక్కటే నినాదం మారుమోగుతోంది. “జై హింద్!”

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *