Idiol MP Putta Mahesh: పుట్టా మహేష్ కుమార్ యాదవ్… ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఎంపీ. రాయలసీమ ప్రాంతానికి చెందిన బడా పొలిటికల్ ఫ్యామిలీ నుండి వచ్చిన యువ లీడర్. కానీ సీట్ల సర్దుబాటులో భాగంగా, ఆఖరి నిమిషంలో టికెట్ కన్ఫామ్ చేసుకుని, ఎవరూ ఊహించని విధంగా గోదావరి ప్రాంతంలోని ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చారు. ప్రచారంలో ప్రజల్ని ఆకట్టుకుని, ఎవరబ్బా ఈ కుర్రోడు… అని ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా చేశాడు. అతి తక్కువ సమయంలోనే ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల మీద పూర్తి అవగాహన తెచ్చుకున్నాడు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక సమస్యలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ.. వాటి మీదే హామీలిచ్చారు. ఎన్నికల ముందు అందరు నాయకులు చెప్పే మాటలే కదా అని ఆ హామీలను ప్రజలు పెద్దగా సీరియస్‌గా ఏమీ తీసుకోలేదు కానీ… కూటమిని గెలిపించుకోవాలన్న కసితో పాటూ మహేష్ యాదవ్ వ్యవహారశైలి నచ్చి లక్షా 80 వేల మెజార్టీతో గెలిపించుకున్నారు.
ప్రజలు సీరియస్‌గా తీసుకున్నా లేకున్నా.. ఎంపీ మాత్రం తాను ఇచ్చిన హామీలను సీరియస్‌గానే తీసుకున్నారు. పాఠశాల విద్యార్థుల సమస్యల నుంచి ఇటు రైతుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు… సామాజిక అంశాల నుంచి దశాబ్దాలుగా ఉన్న కొల్లేరు సమస్య వరకూ.. ప్రతిదీ పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారట ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్. రాష్ట్ర స్థాయిలో పరిష్కారం అయ్యే పనులైతే… ఫైళ్లు పట్టుకుని సీఎం ముందు ప్రత్యక్షమవుతున్నారట. అదే ఢిల్లీలో తేలాల్సిన పనులైతే ఆయా శాఖల కేంద్ర మంత్రులు, అధికారుల వెంటబడుతున్నారట. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలే కాదు.. అంతకుమించి పనిచేస్తూ ప్రజలకు అసలైన పార్లమెంటేరియన్ అంటే ఎలా ఉంటారో చూపిస్తున్నారట. దీంతో ఈ తరహా పనితీరు ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ.. కొత్త తరం రాజకీయాల్లో మార్గదర్శిగా నిలుస్తున్నాడంటూ ఎంపీ మహేష్ యాదవ్‌ని జిల్లా ప్రజలు తెగ అభినందిస్తున్నారట.
Also Read: Russian Plane: 50 మంది ప్రయాణికులతో మాయమైన రష్యా విమానం..
పామాయిల్ రైతులకు న్యాయమైన ధర ఇప్పించడంతో పాటు, వర్జీనియా పొగాకు రైతులకు మద్దతు ధర అందించడంలో ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ చూపిన చొరవతో అక్కడి రైతుల మనసు గెలుచుకున్నారు. ఏలూరు రైల్వే స్టేషన్‌లో వందే భారత్ రైలుకు హాల్ట్‌ని మంజూరు చేయించి జిల్లా ప్రజల కల నెరవేర్చారు. జాబ్ మేళాల ద్వారా ఇప్పటికే 500 మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు. ఏలూరు జిల్లాలోని గుండుగొలను వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నాలుగున్నర కోట్లు మంజూరు చేయించారు. ఉంగుటూరు నియోజకవర్గం సహా అనేక చోట్ల 12 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రత్యేక చొరచూపి, పనులు మంజూరు చేయించారు. 64 లక్షల రూపాయల ఎంపీ ల్యాడ్స్ నిధులతో నూతన పోలీస్ బ్యారెక్స్ భవనం అందించడం, 2 కోట్ల రూపాయల ఎంపీ ల్యాడ్స్ నిధులతో జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ల్యాబ్ పరికరాలు సమకూర్చడం, ద్వారకా తిరుమలలో సామాజిక భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం, హనుమాన్ జంక్షన్‌లోని ఆలయంలో అన్నదాన సత్రాన్ని నిర్మించడానికి పూర్తి సహకారం, పోలవరం నియోజకవర్గంలోని విలీన మండలాల్లో అత్యంత అద్వాన స్థితిలో ఉన్న రహదారి పనులను పూర్తిచేయడం, అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మూడున్నర కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 15 కోట్ల రూపాయల విలువైన రోడ్ల పనులను చేపట్టడం… ఇలా ఏడాదిలోనే ఏలూరు జిల్లా అభివృద్ధిలో, ప్రజా సేవలో, సమస్యల పరిష్కారంలో తన మార్క్‌ని చూపెట్టారు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్.
రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్. ఇక రెండు దశాబ్దాలకు పైగా ఆందోళనల మధ్య జీవిస్తున్న కొల్లేరు వాసుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టే దిశంగా, పార్లమెంట్‌లోనూ, న్యాయస్థానాల్లోనూ ఎంపీ చేసిన కృషి, చూపిన చొరవ లంక గ్రామాల్లో ప్రజల మనసులను గెలుచుకుంది. మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరితోనూ ఎంపీ ఎంతో సఖ్యతతో ఉంటున్నారట. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నా సరే.. ఏలూరు పార్లమెంట్లో పరిధిలో జరుగుతున్న ప్రతి అంశంపై ఆయన నిఘా, పర్యవేక్షణ ఉంటుందట. ఎంపీ ఢిల్లీలో ఉన్నా, ఏలూరులో ఉన్నా.. సమస్యతో ఎవరైనా ఆయన క్యాంపు కార్యాలయం గుమ్మం తొక్కితే చాలు, తమ సమస్య పరిష్కారం అయిపోతుందంటూ ఏలూరు పార్లమెంట్‌లోని ప్రజలు భరోసాగా భావిస్తున్నారట. ఎంపీ నుంచి ఈ స్థాయి పనితీరును ఊహించనటువంటి ఏలూరు పార్లమెంటు ప్రజలు… మా ఎంపీ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్లమెంటేరియన్ అంటూ తెగ అభినందిస్తున్నారట.