Ibhomma Challenge: త్వరలో ఐబొమ్మ హెడ్ అరెస్ట్! హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నోటి నుండి వెలువడి మాట ఇది. ఆ మాట వినగానే ‘అబ్బా సాయిరాం’ ఎంత చల్లని కబురు అనుకున్నారు సినీ పెద్దలు. తెలంగాణ పోలీసులు చేసిన ఈ ప్రకటన సినీ ఇండస్ట్రీని ఊరిస్తోంది. తాజాగా దేశంలోనే అతిపెద్ద పైరసీ మాఫియా అయిన ‘కిరణ్ ముఠా’ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఒక్కడి వల్ల టాలీవుడ్‌కి జరిగిన లాస్ 3700 కోట్లు అంటూ పోలీసులు చెబుతోంటే… టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు అవాక్కయి చూస్తుండిపోయారు. టెలిగ్రామ్, టొరెంటో యాప్‌లను ఉపయోగించుకుని బాహుబలి, పుష్ఫ వంటి సినిమాలను ఎలా పైరసీ చేశారో… శక్తివంతమైన టెక్నాలజీకి కూడా దొరక్కుండా కిరణ్ ముఠా ఎలా చెలరేగిపోయిందో… ప్రభుత్వ సైట్లను సైతం హ్యాక్ చేయగల వారి కెపాసిటీ ఏంటో చెబుతోంటే.. ఒక రకంగా ఒణికిపోయారు.
Also Read: Deepika Padukone: వివాదంపై స్పందించిన దీపికా పదుకొణె.. ఏమన్నారంటే!
కిరణ్ ముఠా పని పట్టిన తెలంగాణ పోలీసులు… నెక్ట్స్ తమ టార్గెట్ ఐబొమ్మ హెడ్‌ని పట్టుకోవడమే అంటున్నారు. ఎందుకంటే ఈ ఐ-బొమ్మని నడిపిస్తోంది ఎవడో కానీ టాలీవుడ్ ఇండస్ట్రీకే సినిమా చూపిస్తున్నాడు. విదేశాల్లో సర్వర్లు, ఇక ఐపీ అడ్రస్‌లు అయితే చిక్కవు, దొరకవు. టాలీవుడ్ బడా నిర్మాతలకే సవాల్ విసిరే స్థాయికి చేరింది ఐబొమ్మ నెట్‌వర్క్. ఈ ఐబొమ్మ హెడ్‌ను పట్టుకుంటే టాలీవుడ్‌కే పెద్ద బ్రేక్ ఇచ్చిన వాళ్లవుతారు తెలంగాణ పోలీసులు. కానీ ఐబొమ్మ లాంటి నకిలీ నెట్‌వర్క్‌లను పట్టుకోవడం అంత సులభమా? అయితే ఇప్పటికీ ఎందుకు పట్టుకోలేకపోయారు. ఎవడికీ తెలియకుండా, ఎవడికీ కనిపించకుండా, విదేశాల్లో నక్కి… పెద్ద సమాజసేవలా ఫీల్ అవుతూ… ఇండస్ట్రీని నట్టేట ముంచేస్తున్న భూతం ఈ ఐబొమ్మ. నిజానికి హెచ్‌డీ క్వాలిటీలో బొమ్మ ఫ్రీగా చూపిస్తున్నాడనే అందరూ అనుకుంటారు కానీ… తెలంగాణ పోలీస్ చెప్పినట్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ రూపంలో కోట్లలో డబ్బు పోగేసుకుంటున్నాడు. ఈ పైరసీ నెట్‌వర్క్ ఒక వ్యక్తి నడిపిస్తున్నదా? లేక టీమ్ వర్కా? వీరి హెడ్ ఆఫీస్ ఎక్కడ? ఒకవేళ పట్టుకున్నా స్వదేశానికి రప్పించగలరా? ఇండియాకు పట్టుకొచ్చినా ఇలాంటోళ్లకి కఠిన శిక్షలు పడతాయా? అలాంటి చట్టాలు మనదేశంలో ఉన్నాయా? ఇదంతా పెద్ద డిబేట్. ప్రస్తుతానికి.. సినీ ఇండస్ట్రీని సర్వ నాశనం చేస్తున్న ఐబొమ్మని తెలంగాణ పోలీసులు చెప్పినట్లే బోణులో పెడతారో లేదో వేచి చూద్దాం.