End of Maoist Era: మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం తీవ్రమైన అంతర్గత ఘర్షణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఆయుధం వదలాలనే వర్గం ఇప్పటికే మూటా ముల్లే సర్దుకుని… అడవీని వీడుతున్నారు. దాదాపు 400 మంది మావోలు అటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్ఘడ్ ప్రభుత్వాల ముందు లొంగుబాట పట్టారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్, మరో కేంద్ర కమటీ సభ్యుడు ఆశన్న ఉన్నారు. వీరిద్దరు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో కీలక భూమిక పోషించారు. మావోయిస్టు పార్టీకి చెందిన సాయుధ క్యాడర్ వందల సంఖ్యలో ఆయుధాలతో లొంగిపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మావోయిస్టు పార్టీని విభేదించి బయటకు వచ్చిన మల్లోజుల, ఆశన్నలు ఉద్యమ ద్రోహులు అని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావడం మంచి పరిణామం అంటూ వీరికి మద్దతునిస్తున్నారు మరికొందరు. ప్రాణాలు కాపాడుకోవడమే పోరాటంగా మారినప్పుడు లొంగిపోవడంలో తప్పులేదని కొందరు చెబుతున్నారు.
మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టు పార్టీలోని కీలక నేతల మధ్య వచ్చిన విభేదాలే ఈ లొంగుబాటుకు కారణం అనే చర్చ జరుగుతుంది. మావోయస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజు ఎన్కౌంటర్లో మృతి చెందిన తరువాత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభం అయ్యాయని చెబుతున్నారు. మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా మల్లోజుల వేణుగోపాల్‌కు పగ్గాలు ఇవ్వకపోవడం పట్ల ఆయన వర్గం పార్టీతో విభేదించింది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముప్పాళ్ల లక్ష్మణరావు తరువాత పార్టీ పగ్గాలు మల్లోజులకు ఇస్తారనే చర్చ జరిగింది. అయితే అప్పుడు నంబాళ కేశవరావు వైపే కేంద్రకమిటీ మొగ్గుచూపింది. ఇక నంబాళ అలియాస్ బసవరాజు తరువాతనైనా మల్లోజులను చీఫ్ గా ఎన్నుకుంటారని భావించారు. అకస్మాత్తుగా తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జీ పేరు తెరమీదకు వచ్చింది. దీంతో మల్లోజుల వర్గం పూర్తిగా పార్టీ కేంద్రకమిటీలోని ఇతర నాయకత్వంతో విభేదాలు పెంచుకుందనే చర్చ జరుగుతోంది. దీనివల్లే మల్లోజుల వర్గం ఆయుధాలు వీడాలనే నిర్ణయానికి వచ్చిందని పార్టీలోని ఓ వర్గం చెబుతోంది.
Also Read: Pawan Kalyan: మొంథా తుఫాన్‌పై పవన్ సమీక్ష.. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి
తమ లొంగుబాటుపై మావోయిస్టు పార్టీ చేస్తున్న ఆరోపణలపై మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము కోవర్టులుగా పనిచేసి పార్టీకి ద్రోహం చేశామన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సాయుధ పోరాటాన్ని విరమించాలనే నిర్ణయం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబళ్ల కేశవరావు బతికుండగానే ఆయన నాయకత్వంలో తీసుకున్నదేనని స్పష్టం చేశారు. ఈ మేరకు లొంగిపోయిన ఇతర మావోయిస్టులతో కలిసి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. “మావోయిస్టు పార్టీ నుంచి ఎవరు బయటకు వచ్చినా ద్రోహులు అనడం పరిపాటి. అందుకే మొదట స్పందించవద్దని అనుకున్నాం. కానీ, పార్టీకి జరిగిన నష్టానికి మేమే కారణమని, కోవర్టులుగా పనిచేశామని ఆరోపించడంతో సమాధానం చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాం” అని ఆశన్న తెలిపారు. అడవి మార్గాన్ని వీడే క్రమంలో సాయుధ పోరాట విరమణ, శాంతి చర్చలు అనే రెండు అంశాలపై చర్చ జరిగిందని, చివరికి సాయుధ పోరాట విరమణకే మొగ్గు చూపినట్లు వివరించారు. ఈ విషయంలో పౌరహక్కుల సంఘాల నేతలు, ప్రజాస్వామ్యవాదులు తమ పరిధి దాటి మాట్లాడుతున్నారని ఆశన్న మండిపడ్డారు.
ఏది ఏమైనా ఇప్పుడు మావోయిస్టులు అడవిని వీడుతున్నారు, వనం నుండి జనంలోకి వస్తున్నారు. తాము లొంగిపోవడం లేదనీ, కేవలం ఆయుధాలను ప్రజల ముందు, ప్రభుత్వాల ముందు వదిలేస్తున్నాం అని చెబుతున్నారు. పరిస్థితుల ప్రభావంతో ఆయుధం ఇప్పుడు అడవిని విడుతోంది. ఈ ప్రయాణం ఎటు వైపు అనేది కాలమే నిర్ణయిస్తుంది.

