Duvvada Suspension Agenda: వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధిష్ఠానం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం తాడేపల్లిలో జరిగిన పీఏసీ సమావేశంలో ఉత్తరాంధ్ర, ఇతర నేతలు దువ్వాడ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో, క్రమశిక్షణ కమిటీ సిఫారసుతో ఈ చర్య తీసుకున్నట్లు పార్టీ ప్రకటించింది. అయితే, దువ్వాడ కుటుంబ వివాదమే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ గత కొంతకాలంగా తన భార్య వాణి, పిల్లలతో ఉన్న విభేదాల కారణంగా దివ్వెల మాధురితో సహజీవనం చేస్తున్నారు. ఈ వివాదం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. కొత్త ఇంటి రిజిస్ట్రేషన్ విషయంలో వాణి నిరసన దీక్ష చేయగా, దువ్వాడ ఆమెపై దుర్భాషలాడి, దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనలు వైసీపీకి చెడ్డ పేరు తెచ్చాయి.
2024 ఎన్నికలకు ముందే దువ్వాడ కుటుంబ విభేదాలు బయటకొచ్చాయి. ఎన్నికల అనంతరం వివాదాలు మరింత ముదిరి, న్యాయస్థానంలో కేసులు కొనసాగుతున్నాయి. గతంలో దువ్వాడ శ్రీనివాస్.. అచ్చెన్నాయుడు కుటుంబంపై దాడులు, రౌడీయిజంతో వార్తల్లో నిలిచారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దువ్వాడ చర్యలను ప్రోత్సహించినప్పటికీ, ఇప్పుడు దువ్వాడకు సోషల్ మీడియాలో వస్తోన్న హైప్… జగన్ క్రేజ్‌ను కూడా బీట్ చేస్తుండటంతో… సస్పెన్షన్ వేటు పడక తప్పలేదన్నది మరో వెర్షన్. అయితే… ఇన్నాళ్లూ దువ్వాడను ఉపేక్షించిన వైసీపీ, ఇప్పుడు హఠాత్తుగా చర్యలు తీసుకోవడం వైసీపీలో గుసగుసలకు తావిచ్చింది.
పైన చెప్పినట్లు కుటుంబ వివాదం, మీడియా, సోషల్‌మీడియాల్లో రచ్చ చేయడం వంటి ఒకటి రెండు వెర్షన్లు పైకి వినిపిస్తున్నా… వైసీపీలో దువ్వాడ సస్పెన్షన్ మిస్టరీకి ఎక్కడా సరైన సమాధానం అయితే దొరకడం లేదనే చెప్పాలి. అసలు వైసీపీలో అనంతబాబులా నేరాలు, ఘోరాలు చేసే వారిని కానీ… దువ్వాడలా ప్రత్యేక లక్షణాలున్న వారిని కానీ… గోరంట్ల, అంబటిలా చెప్పుకోలేని వీక్ నెస్‌లు ఉన్న వారిని కానీ… సస్పెండ్ చేసే సంస్కృతి ఎప్పుడూ లేదు. క్రమశిక్షణ కమిటీలు, పొలిటికల్ అడ్వైజింగ్ కమిటీలు నామ్ కే వాస్త్ అన్నట్లు ఉంటాయంతే.
Also Read: YCP Direction Nani Game: బాబుపై ప్రేమ, తమ్ముడిపై ద్వేషం – వాటే గేమ్!
Duvvada Suspension Agenda: క్రమశిక్ష చర్యలు సజ్జల వంటి వారి ఆధ్వర్యంలో, పొలిటికల్ అడ్వైజింగ్ ఐ-ప్యాక్ వంటి సంస్థల ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. 35 మందితో అట్టహాసంగా ఏర్పాటు చేసిన పొలిటికల్ అడ్వైజింగ్ కమిటీ కాబట్టి… అది కూడా తొలి సమావేశం కాబట్టి… పార్టీని ఏదో పూర్తిగా ప్రక్షాళన చేసేద్ధామన్న వారి ఉత్సాహాన్ని ఆదిలోనే నీరుగార్చడం ఎందుకులే అనుకుని, ఏదో మొహమాటం కొద్దీ వారి సిఫార్సుకు జగన్ ఓకే చెప్పినట్లు ఉన్నారు. అయినా ఆ పార్టీ నుండి సస్పెండ్ అయినంత మాత్రాన దువ్వాడకు జగన్ గుండెల్లో ఉన్న స్థానాన్ని ఎవ్వరూ తక్కువ చేయలేరు. అనంతబాబులా ఎంచక్కా దువ్వాడ ఇక మీదట కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.