BRS District Incharges: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలు ఉన్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం హవా నడిచిన కాలంలో జిల్లా పార్టీ అధ్యక్షులకు మంచి గుర్తింపు ఉండేది. నాలుగు జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు కూడా ఉండడంతో అధ్యక్ష పదవులకు డిమాండ్ మంచిగ కనిపించేది. అయితే, ఏడాదిన్నర క్రితం కేసీఆర్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత నాలుగు జిల్లాల అధ్యక్షులు క్రమంగా తమ పదవుల పట్ల ఆసక్తి కనబరచడం తగ్గిపోయింది. నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, ముధోల్ మాజీ శాసనసభ్యులు జి.విఠల్ రెడ్డి, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇద్దరూ గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం కోనప్ప ఏ పార్టీకి దగ్గర కాకుండా న్యూట్రల్‌గా ఉన్నారు. అప్పటి నుంచి ఈ రెండు జిల్లాలకు పార్టీ అధ్యక్షులు లేరు. కొత్తవారిని నియమించే విషయంలో కూడా పార్టీ అధిష్ఠానం పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు పార్టీ కార్యకర్తల్లో ఉన్నాయి.
పార్టీ పరంగా ఇస్తున్న కార్యక్రమాలను నిర్వహించడంలో కూడా ఈ రెండు జిల్లాల్లో తల తోక లేకుండా తయారైంది గులాబీ పార్టీ పరిస్థితి. ఇక మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ గత ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగారు. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో మంచిర్యాల జిల్లా వైపు అసలు రావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ సమయం ఆయన హైదరాబాద్‌లోనే గడుపుతున్నారని పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మాత్రం అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ఆయన తన సొంత నియోజకవర్గం ఆదిలాబాద్‌కు మాత్రమే పరిమితమవుతున్నారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పెద్దగా ఆదిలాబాద్ జిల్లా గులాబీ శ్రేణులకు ఆయన సమయం కేటాయించడం లేదని చర్చ జరుగుతోంది.
Also Read: Mithun Reddy: ఢిల్లీ లిక్కర్ కేసు: రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రెండు జిల్లాల అధ్యక్షుల నియామకం లేకపోవడంతో కార్యకర్తలను పట్టించుకొనే నాయకుడే లేకుండా పోయాడు. దీంతో ఉన్న కార్యకర్తల్లో కొందరు సైలెంట్‌గా ఉండిపోగా, మరికొందరు పక్క పార్టీల కండువాలు కప్పుకున్నారట. గతంలో గులాబీ పార్టీకి ఉమ్మడి జిల్లాలో కీలక నేతగా ఉన్న బాల్క సుమన్, ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో, దానికి తోడు స్థానిక నేతలపై దాడులు జరుగుతున్నా, కేసులు అవుతున్నా…. జిల్లా వైపు రాకపోవడంతో ఆయనను నమ్ముకున్న కార్యకర్తలు ఏమి చేయాలో తోచక సైలెంట్‌గా ఉన్నారట. చేసేది ఏమీ లేక గులాబీ పార్టీనే నమ్ముకున్న మరికొందరు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దగ్గరికి వెళ్తున్నారట.
రాష్ట్రంలో ఒకవైపు కాళేశ్వరం అక్రమాలు, మరోవైపు ఫోన్ టాపింగ్ వంటి వ్యవహారాలు హాట్ హాట్‌గా ఉన్న నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్‌లు పార్టీ పరంగా సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇద్దరు జిల్లా అధ్యక్షులు పెద్దగా పార్టీ పరమైన కార్యక్రమాలు చేపట్టకపోగా, ఖాళీగా ఉన్న రెండు జిల్లాల అధ్యక్ష స్థానాల్లో ఇంకా ఎవరినీ నియమించలేదు. స్థానిక ఎన్నికలు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఒకేసారి నాలుగు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తారా? లేదా ఖాళీగా ఉన్న రెండు స్థానాలను భర్తీ చేస్తారా? అన్న అంశంపై పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అధికారం ఉన్నప్పుడు పదవుల కోసం పోటీపడ్డ నేతలు, అధికారం కోల్పోయాక పార్టీ కార్యకర్తల కోసం, వారిలో మనోధైర్యం నింపేందుకు సమయం ఇవ్వకపోవడంపై కార్యకర్తల్లో నిరాశ నెలకొందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.