Brahmam Gari House Collapse: కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో వరుసగా కురుస్తున్న వర్షాలకు జగద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి నివాస గృహం అర్ధ రాత్రి వేళ కుప్ప కూలింది. ఎంతో చరిత్ర గల పవిత్రమైన క్షేత్రంలో బ్రహ్మంగారు నివసించిన ఈ గృహాన్ని పరిరక్షించకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మం గారి మఠంలో కోరిన కోరికలు తీర్చే దైవం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అని, 16 శతబ్దం నాటి వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం కూలిపోవడం చాలా దురదృష్టకరమని కర్ణాటక భక్తులు సైతం బాధపడుతున్నారు.
భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్తగా జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని అశేష భక్త జనం విశ్వసిస్తారు. అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం ఇప్పటికి దివ్య శక్తితో నిండి ఉన్నదని విశ్వసిస్తారు. ఎండోమెంట్ అధికారుల తప్పిదాలు ఒకవైపు, వారసుల గొడవలు మరోవైపు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాసాన్ని కుప్పకూల్చాయని చెప్పాలి. దాదాపు 5 ఏళ్ల నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి నడయాడిన నేల, ఆయన నివాసమున్న స్వగృహం కనీసం మరమ్మత్తులకు నోచుకోలేదు. ఏది ఏమైనప్పటికీ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి అభిమానులు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు.
Also Read: Cyclone Montha Effect: మొంథా తుఫాన్‌కు తెలంగాణలో జరిగిన పంట నష్టం ఇదే!
జగద్గురు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వీరబ్రహ్మేంద్రస్వామికి భక్తులు ఉన్నారు. వర్తమాన భవిష్యత్తును ముందే చెప్పిన మహానుభావుడుగా విశ్వాసంతో కొలుస్తారు. వీరబ్రహ్మేంద్రస్వామి కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో జీవ సమాధి కావడం తాము చేసుకున్న పుణ్యంగా కడప జిల్లా ప్రజలు భావిస్తారు. అటువంటిది… స్వయాన బ్రహ్మంగారి వారసులతో పాటూ ఎండోమెంట్ అధికారులు బ్రహ్మంగారి నివాసం కుప్పకూలిపోవడానికి కారకులయ్యారని తెలుస్తోంది. వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం కూలిపోవడంపై స్థానిక ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీంతో హుటాహుటిన బ్రహ్మంగారిమఠం చేరుకున్న జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్… ఇంటెక్స్ సభ్యులతో చర్చించి బ్రహ్మంగారి నివాసం జీవనోధారణ చేయాలని ఆదేశాలిచ్చారు.
బ్రహ్మంగారి నివాసంపై వారసులకు ఏమాత్రం శ్రద్ధ లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేవలం సంపాదనే లక్ష్యంగా ఎండోమెంట్ అధికారులు, బ్రహ్మంగారి వారసులు మఠాన్ని చూస్తున్నారన్న విమర్శ వ్యక్తమవుతోంది. ఇప్పటికే పీఠాధిపతి పీఠం కోసం వారసులు రోడ్డుకెక్కిన సంగతి స్థానికంగా చర్చనీయాంశం అవుతున్నది. అసలు బ్రహ్మంగారిమఠంలో ఏం జరుగుతుందో, ఎందుకు ఐదు సంవత్సరాల నుంచి బ్రహ్మంగారి నివాసం మూతపడిందో అర్థంకాక బ్రహ్మంగారి భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహామహులు బ్రహ్మంగారి మఠం వచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటే, బ్రహ్మంగారి నివాసం కుప్పకూలిపోవడంపై భక్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భక్తులు తమ సొంత నిధులతో బ్రహ్మంగారి నివాసం జీవనోదారణ చేస్తామంటున్నా అధికారులు, వారసులు పట్టించుకోకపోవడం ఇక్కడ మరో విచిత్రం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఎండోమెంట్ అధికారులు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారసులు స్పందించాలని, వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం పునర్‌నిర్మించాలని భక్తులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.


