Bhumana Hydrama: తిరుమల గోశాలలో 100కు పైగా గోవులు చనిపోయాయంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి లేవనెత్తిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. కానీ, ఈ ఆరోపణల వెనుక దాగిన రాజకీయం ఏంటో బయటపడింది. భూమన రచించిన ఈ గో-డ్రామా కేవలం రాజకీయ స్టంట్ మాత్రమే అని అర్థమౌతోంది. తన గత అవినీతిని కప్పిపుచ్చడానికి, పార్టీలో తన ఉనికిని నిలబెట్టుకోవడానికి ఆయన చేస్తున్న హీనమైన ప్రయత్నంగా తెలుస్తోంది. భూమన ఆరోపణలు తప్పుడు ప్రచారాలేనని బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు గోశాలకు రమ్మని సవాల్ విసిరారు. భూమన సవాల్‌ను స్వీకరించి, ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానని ప్రకటించారు. కానీ, గోశాలకు వెళ్లే బదులు రెండు వేల మందితో ర్యాలీ సిద్ధం చేసి, రోడ్డుపై పడుకుని నిరసనల డ్రామా ఆడారు.
పోలీసులు రాజకీయ ర్యాలీకి అనుమతి లేదని.. భూమనను, ఆయన వ్యక్తిగత సిబ్బందిని మాత్రమే గోశాలలోకి అనుమతిస్తామని చెప్పగా, ఆయన మాత్రం తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రులు నారాయణ స్వామి, రోజాలతో సహా తన మందీ మార్భలాన్ని, తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల నుండి పోగు చేసుకున్న సుమారు 2 వేల మంది పటాలాన్ని అంతటినీ తీసుకొస్తానని పట్టుబట్టారు. అనుమతి లభించకపోవడంతో, రోడ్డుపై పడుకుని నాటకాలు ఆడినట్లు తెలుస్తోంది. నిజానికి వైసీపీ నేతల కామన్ డైలాగ్ ఒకటుంది. సింహం సింగిల్‌గా వస్తుందని చెప్తుంటారు ఆ పార్టీ నేతలు. మరి భూమన సింహం అయితే సింగిల్‌గా వెళ్లాలి కదా. ఈ రకంగా గుంపులుగా వస్తామంటే ఆయన వైసీపీ సింహం ఎలా అవుతారు? అని అనుకున్నారంతా భూమన వీధి నాటకాన్ని చూసి. ఇది గోవుల పట్ల ప్రేమా? లేక, తాను గతంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు పాల్పడిన నేరాలు, ఘోరాలన్నీ బయటపడతాయన్న భయమా? అన్న ప్రశ్న అక్కడున్న అందరిలోనూ ఉత్పన్నమైంది.
Bhumana Hydrama: సీపీఐ నేత నారాయణ గోశాలను పరిశీలించి, గోవులు ఆరోగ్యంగా ఉన్నాయని, దాణా సరిపోతుందని స్పష్టం చేశారు. భూమన ఆరోపణల్లో నిజం లేదని తేల్చారు. అయినా, భూమన ఈ డ్రామాను ఎందుకు ఆడుతున్నారు? దీని వెనుక దాగిన అసలు కథ ఏంటి? భూమన గతంలో టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు జరిగిన అవినీతి, విదేశీ గోవుల స్కామ్, కల్తీ నెయ్యి వ్యవహారం, ఆన్లైన్ టికెట్లలో అక్రమాలు… ఇవన్నీ ఎక్కడ బయటపడతాయో అన్న ఆందోళనతో ఆయనకు గతి కొద్దిరోజులుగా సరిగ్గా నిద్రాహారాలు కూడా ఉండట్లేదట. ఈ విషయమై ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా ఆందోళన చెందుతున్నారని రూమర్లొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గోశాల మాజీ డైరెక్టర్‌తో కలిసి ఈ గో-మరణాల ఆరోపణలను తెరపైకి తెచ్చి, టీటీడీని రాజకీయంగా దెబ్బతీయాలని భూమన చూస్తున్నారని టాక్ నడుస్తోంది. సదరు గోశాల మాజీ డైరెక్టర్‌పై తొక్కిసలాట ఆరోపణలతో టీటీడీ చర్యలు తీసుకోవడంతో, ఆయన భూమనతో కలిసి ఈ కుట్ర పథకం పన్నినట్లు సమాచారం.
Also Read : Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ
భూమనకు ఈ డ్రామా రెండు విధాలుగా ఉపయోగం. ఒకటి, గతంలో తన పాలనలో టీటీడీలో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చడం. రెండు, వైసీపీలో తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడం. గత ఎన్నికల్లో తన కుమారుడు ఓడిపోవడం, కార్పొరేషన్ అవినీతి వ్యవహారాల్లో ఇరుక్కోవడంతో భూమన రాజకీయంగా పట్టు కోల్పోతున్నారు. అందుకే, ఈ గో-నాటకంతో రాజకీయంగా తిరిగి గాడిన పడాలని చూస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. కానీ, భూమన డ్రామాలు భూమరాంగ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజంగా సవాల్ స్వీకరించి ఉంటే, భూమన ఒక్కరే గోశాలకు వెళ్లి పరిశీలించి ఉండేవారని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. బదులుగా, రెండు వేల మందితో ర్యాలీ డ్రామా, రోడ్డుపై నిరసనలు… ఇవన్నీ ఆయన స్వార్థ రాజకీయాల్లో భాగమేని సోషల్‌మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. వైసీపీ ఈ హీన రాజకీయాలతో తిరుమలను రాజకీయ యుద్ధ భూమిగా మార్చాలని చూస్తోందని మరోవైపు భక్తులు మండి పడుతున్నారు.
Bhumana Hydrama: గోవుల మరణాల ఆరోపణలు తప్పని తేలినా, భూమన ఫేక్ వార్తలతో, డ్రామాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు… కానీ, నిజం ఎప్పటికీ దాగదు… భూమన వీధి నాటకాల వెనుక దాగిన అవినీతి, కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడతాయి… ఈ నీచ రాజకీయాలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని శ్రీవారి భక్తులంటున్నారు.