Balineni hopes on Pawan: కూటమి వర్సెస్ వైసీపీ రాజకీయ పోరులో నేతలది అంతా ఒక దారైతే.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాత్రం వేరే లెక్కల్లో ఉన్నారు. జగన్ తన ఆస్తులను దోచేశారంటున్న బాలినేని, పవన్ సినిమాయే తనకు ఇక ఆధారం అన్నట్లుగా చెబుతున్నారు. జనసేనలో చేరినా పదవుల కోసం కాదనీ, పవన్‌తో సినిమా తీసే లక్ష్యమే అని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. కానీ, పవన్ సినిమా కమిట్మెంట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు గ్యాప్ తీసుకుంటారనే టాక్ నడుస్తోంది. సినిమాలకు విరామం ఇచ్చి పార్టీపై దృష్టి పెడతారని అంటున్నారు. అయితే బాలినేని మాత్రం పవన్‌తో సినిమా తీయాలని తొందరపడుతున్నట్లున్నారు.
పవన్ సినిమాలకు గుడ్‌బై చెబుతారా? ఇంకా ఒక్క సినిమా మాత్రమే ఆయన నుంచి వచ్చే అవకాశం ఉందా? జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకటనలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 2024 ఎన్నికల ముందే పూర్తయ్యి విడుదల కావాల్సిన ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలు… పవన్ రాజకీయ బిజీతో షూటింగ్ జరుపుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ పెండింగ్ చిత్రాలను పవన్ కళ్యాణ్ శరవేగంగా పూర్తి చేసి విడుదల చేశారు. ఇందులో హరహర వీరమల్లు ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించినా, ఓజీ మాత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ నేతలు పవన్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పోస్టు ఎందుకు.. షూటింగులు చేసుకోక అంటూ మాజీ మంత్రి రోజా ఇటీవల ఘాటు వ్యాఖ్యలే చేశారు. అలా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో బాలినేని కాస్తంత తొందరపడ్డారు.
Also Read: PM Modi: బీహార్ మహిళలకు మోదీ దసరా శుభవార్త: ఖాతాల్లో రూ.10 వేలు జమ!
అలా… పవన్ ప్రస్తుతానికి సినిమాలు ఆపేస్తారంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు కాస్తా సోషల్‌మీడియాలో తప్పుగా ప్రచారం అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఇక ఒక్క సినిమా మాత్రమే చేస్తారంటూ బాలినేని చెప్పింది ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఉస్తాద్ భగత్‌సింగ్ గురించా? లేక బాలినేని నిర్మాతగా తీయాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ సినిమా గురించా అన్న కన్ఫ్యూజన్ నెలకొంది. అటు ఫ్యాన్స్ ఏమో… పవన్ సినిమాలు ఆపకూడదు అని బలంగా కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తనకు పార్టీ నడిపించేందుకు ఉన్న ఒకే ఒక్క ఆధారం సినిమానే కాబట్టి.. సినిమాలు ఆపను అనే విధంగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఇటీవలనే చెప్పారు. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా భవిష్యత్‌లో తన సినిమాలు ఉంటాయని హింట్ ఇచ్చారు. పవన్ ఇలా చెబుతుంటే, ఫ్యాన్స్ అదే కోరుకుంటుంటే.. బాలినేని మాత్రం పవన్ సినిమాలు ఆపేస్తారని చెప్పడం ఏంటని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దీంతో డ్యామేజీ కవర్ చేసుకోవడంలో భాగంగా… మరోసారి క్లారిటీ ఇచ్చారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. పవన్ కళ్యాణ్‌కు సినిమా అంటే ప్రాణం అని.. ఆయన ఇంకా బోలెడు సినిమాలు తీయాలి, రాష్ట్ర ప్రజలకు అలరించాలి, ఆయన భవిష్యత్తులో తీయబోయే సినిమాలలో తన సినిమా కూడా ఉండాలని బలంగా కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
మార్చిలో పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో బాలినేనికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ సభలోనే బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తులను జగన్ లాక్కున్నారనీ, పవన్‌తో సినిమా తీసి ఆర్థికంగా బలపడాలనుకుంటున్నానని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు.
బాలినేనికి రాజకీయ అవకాశాలు కనుచూరు మేరలో లేనట్లే కనిపిస్తోంది. ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, బాలినేని జనసేనలో చేరడాన్నే వ్యతిరేకించారు. ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటు ఇస్తారు అనే ఊహాగానాలు ఉన్నా, పవన్ బాలినేనిని రాజకీయ ప్రాధాన్యత కోణంలో కాకుండా, కేవలం సన్నిహితుడిగానే చూస్తున్నట్లు తెలుస్తోంది. అయినా, బాలినేని తన వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. స్థానిక ఎన్నికల్లో తన అనుచరులను బరిలోకి దించి, 2029 ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఒంగోలులో పవన్‌తో భారీ సభ ప్లాన్ చేయాలని చూస్తున్నారు. అదే క్రమంలో పవన్‌తో పవన్‌తో సినిమా తీయాలనే తన కలను కూడా వదలుకోవడం లేదు బాలినేని. ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.