IAS Teja on Pawan

IAS Teja on Pawan: జగన్‌ పేషీలో ఒక శ్రీలక్ష్మి.. పవన్‌ పేషీలో ఒక కృష్ణతేజ!

IAS Teja on Pawan : జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలామంది అనుకున్నారు…‘సినిమా స్టార్‌కి రాజకీయం ఒక ఫ్యాషన్!’ అని. కానీ, పవన్ తన చర్యలతో ఆ విమర్శలు తుడిచిపెట్టుకుపోయేలా చేసి, సేవలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నారు. నటుడిగా ఉన్నప్పుడే సామాజిక సేవలో మునిగిన పవన్, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఆ సేవను మరింత విస్తృతం చేస్తున్నారు. తాజాగా, మంగళగిరిలో చేపట్టిన ఒక వినూత్న కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమం ద్వారా, పవన్ ఎమ్మెల్యేగా తనకు వస్తోన్న వేతనాన్ని పిఠాపురం అనాథ పిల్లల భవిష్యత్తుకు అంకితం చేస్తూ ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు.

పవన్‌కు ఎమ్మెల్యేగా నెలకు రూ.2.10 లక్షల వేతనం అందుతుంది. ఈ మొత్తాన్ని పిఠాపురంలోని 42 మంది అనాథ పిల్లలకు సమానంగా పంచాలని నిర్ణయించారు. ఆయన ఆదేశాలతో, జనసేన బృందం పిఠాపురంలో తల్లిదండ్రులను కోల్పోయి కష్టాల్లో ఉన్న పిల్లలను గుర్తించింది. శుక్రవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి 32 మంది అనాథ పిల్లలను తీసుకొచ్చారు. వారికి ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున తన సొంత చేతులతో అందజేశారు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌. ఇక నుండి ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.5 వేల సాయం చిన్నారుల వద్దకే చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఈ సేవను కొనసాగిస్తానని పవన్ ప్రకటించారు. “ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. వారి కోసమే ఈ వేతనం ఖర్చు చేయాలని, ముఖ్యంగా అనాథ పిల్లల భవిష్యత్తు కోసం వినియోగించాలని నిర్ణయించాను,” అని పవన్ ఉద్వేగంతో చెప్పారు.

ఈ కార్యక్రమానికి సమన్వయం చేసిన యువ ఐఏఎస్ అధికారి, పవన్ వ్యక్తిగత కార్యదర్శి కృష్ణతేజ.. డిప్యూటీ సీఎం వినూత్న ఆలోచన గురించి మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారన్నారు. 42 మంది అనాథ పిల్లలకు ప్రతి నెలా పెన్షన్‌లా 5 వేలు చొప్పున చేరేలా ఈ విధానాన్ని అమలు చేస్తామని కృష్ణతేజ వివరించారు. కేరళలో త్రిసూర్ కలెక్టర్‌గా సామాజిక సేవల్లో పేరు తెచ్చుకున్న కృష్ణతేజను పవన్ డిప్యూటేషన్‌పై ఏపీకి తీసుకొచ్చారు. పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న ఈ సేవా కార్యక్రమంలో భాగమవ్వడం తనకు గర్వకారణం అన్నారు కృష్ణతేజ. డిప్యూటీ సీఎం ఆదర్శవంతమైన నాయకత్వం అధికారులకు స్ఫూర్తి అని కృష్ణతేజ ఉద్ఘాటించారు. అనాథ పిల్లల కోసం పవన్‌ తీసుకున్న నిర్ణయమే కాదు, పవన్ కళ్యాణ్‌ నిర్ణయంపై ఐఏఎస్‌ కృష్ణతేజ మనసుతో స్పందించిన తీరూ అందర్నీ ఆకట్టుకుంది.

ALSO READ  Mahaa Vamsi: ఏఒక్కడిని వదలను..రెడ్ బుక్ లెక్క తేలుస్తా..:

Also Read: Uttam Kumar Reddy: ధాన్యం కొనుగోళ్లపై హరీశ్‌రావు అబద్ధాలు మానుకోవాలి

IAS Teja on Pawan: ఇక్కడే పవన్ కళ్యాణ్ నాయకత్వం, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి విధానాల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. జగన్ హయాంలో ప్రతిభావంతులైన ఐఏఎస్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు గురయ్యారు. ఉదాహరణకు, ఐఏఎస్ శ్రీలక్ష్మీ, యువ వయసులో సివిల్ సర్వీసెస్‌లో అద్భుత విజయం సాధించి, కీలక బాధ్యతలు నిర్వర్తించినా, వైఎస్, జగన్ ప్రభుత్వాల్లో రాజకీయ ఒడిదుడుకులతో ఆమె కెరీర్ అస్థిరతకు గురైంది. జగన్ హయాంలో అధికారులను అవినీతి వైపు మళ్లించే విధంగా ఒత్తిడి చేయడం సర్వసాధారణమైంది. దీనికి విరుద్ధంగా, పవన్ కళ్యాణ్ అధికారుల ప్రతిభను సమాజ సేవకు, ఆదర్శ పాలనకు వినియోగిస్తున్నారు. కృష్ణతేజ వంటి అధికారులను సామాజిక, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ, వారి కెరీర్‌ను మరింత ప్రకాశించేలా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమం కేవలం ఆర్థిక సహాయం కాదు… అనాథ పిల్లల ఆత్మగౌరవాన్ని, ఆశలను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లే ప్రయత్నం. జగన్.. అధికారులను అవినీతి బురదలో కూరుకుపోయేలా చేస్తే, పవన్.. అధికారులను సమాజ సేవలో సూర్యకాంతులుగా మారుస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *