Headache With New MLAS: 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 175 స్థానాల్లో 164 గెలుచుకుని ఘన విజయం సాధించింది. ఏడాది పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, యువనేత లోకేష్‌లు పాలనలో తమదైన ముద్ర వేశారు. అయితే, కూటమి 164 మంది ఎమ్మెల్యేలలో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా గెలిచి, కొత్తగా అసెంబ్లీకి వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే.. మంత్రివర్గంలో మూడింట రెండొంతుల మంది కొత్తవారికే చంద్రబాబు అవకాశం ఇచ్చారు. అలా ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అయిన వారిలో కొందరు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి తలనొప్పులు తెస్తున్నారని టాక్ నడుస్తోంది. యువ రక్తాన్ని ప్రోత్సహిద్దాం.. కొత్త వారికి చాన్సులిద్దాం.. అని అధినేత భావిస్తే.. తమ వ్యవహార శైలితో.. సీనియర్లు చాలా నయం అనుకునేలా చేస్తున్నారట. ఈ విషయం కూటమి అధిష్ఠానంలో ఆందోళన కలిగిస్తోంది.
కూటమి నుంచి గెలిచిన 164 మంది ఎమ్మెల్యేల్లో తొలిసారి ఎన్నికైనవారు చాలా మందే ఉన్నారు. వీరిలో పలువురు పాలనలో చురుగ్గా వ్యవహరించడంలో, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం, గ్రూపు తగాదాల్లో మునిగిపోవడం, వైసీపీ నేతలతో సంబంధాలు కొనసాగించడం వంటి పనులతో ప్రజల్లో విమర్శల పాలవుతున్నారట. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఈ సమస్య కాస్త తీవ్రంగానే ఉందని సమాచారం. ముఖ్యంగా అధిష్టానానికి మొండి ఘటాల్లా తయారైన ఐదారుగురు ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు మంత్రులు అయితే.. తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని, వీరి పనితీరు ప్రభుత్వ ప్రతిష్ఠకు మచ్చ తెస్తోందని చర్చలు జరుగుతున్నాయి.
Also Read: KTR: కేసీఆర్‌కు నోటీసులపై స్పందించిన కేటీఆర్.. ఏమన్నారు అంటే..?
Headache With New MLAS:ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు నిరంతరం సర్వేలతో అప్రమత్తం చేస్తున్నారు. అయినప్పటికీ, గణనీయమైన మార్పేమీ కనిపించడం లేదని నివేదికలు అందాయట. ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణ, పింఛన్లు, దీపం-2, తల్లికి వందనం, మెగా డీఎస్సీ వంటి పథకాలతో ముందుకు సాగుతున్నా, ఆ ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వల్ల.. ఆయా నియోజకవర్గాల్లో సానుకూలత పెరగడం లేదని గుర్తించారట. సొంత కేడర్‌తో దూరం పెంచుకోవడం, పరిపాలనలో పట్టు సాధించలేకపోవడం వల్ల.. వీరు వచ్చే ఎన్నికల్లో టికెట్ కోల్పోయే ప్రమాదం ఉందని టీడీపీ అధిష్ఠానం హెచ్చరిస్తోంది.
పాలనలో చురుకుదనం, కార్యకర్తలతో సమన్వయం, ప్రజలతో సన్నిహితంగా ఉండటం ద్వారా లోపాలను సరిదిద్దుకోవాలని చంద్రబాబు సూచిస్తున్నారు. మరి.. రానున్న రోజుల్లో సదరు ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకుంటారా? లేక అధిష్టానం ఆగ్రహానికి గురై.. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.