AP First In Forign Investments: కూటమి సూపర్ సిక్స్‌లో ఇప్పటికే నాలుగు పథకాలు పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలు వరుసగా అమలు చేసింది కూటమి ప్రభుత్వం. మిగిలింది ఆడబిడ్డ నిధి, యువతకు 20 లక్షల ఉద్యోగాల హామీ. ఇందులో ఆడబిడ్డ నిధి అమలు విషయంలో ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఈ పథకాన్ని పీ4 కింద చేరుస్తామని అప్పట్లో ప్రకటించింది. అయితే పీ4 పథకానికే ఇప్పటికీ స్పష్టమైన విధివిధానాలు లేవన్న విమర్శ వ్యక్తమైంది. దీనిపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరణ కూడా ఇచ్చారు.
ఇక యువతకు 20 లక్షల ఉద్యోగాల సృష్టి ఐదేళ్లలో సాధ్యమా? అన్న అంశానికి వద్దాం. ఈ హామీ ముహూర్తం పెట్టుకొని ఏదో ఒక రోజు అమలు చేసేది కాదు. ఐదేళ్లలో క్రమంగా అమలు జరగాలి. అయితే అంతకంటే ముందే కూటమి ప్రభుత్వం ఈ టార్గెట్‌ను బద్దలు కొట్టేలా కనిపిస్తోంది. అందుకు కారణం రాష్ట్రానికి వస్తోన్న భారీ పెట్టుబడులు, క్యూ కడుతున్న అంతర్జాతీయ కంపెనీలే. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. రాష్ట్రానికి ఇది నిజంగానే ఒక పెద్ద గుడ్‌న్యూస్. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గత 15 నెలల్లో రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడులు ఎంతో తెలుసా? అక్షరాలా 9 లక్షల కోట్ల రూపాయలుగా చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. వీటి ద్వారా 4 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు క్రియేట్ అవ్వనున్నాయట. తాజాగా, ఒకే సారి రూ. 1.14 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికొచ్చాయి. ఇది దేశ చరిత్రలోనే రికార్డు. ఈ ఎఫ్‌డీఐ ద్వారా 87 వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ పెట్టుబడులు వచ్చే నాలుగేళ్లలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో కీలక హామీగా ఉన్న 20 లక్షల ఉద్యోగాల కలను సాకారం చేయనున్నాయని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్.
Also Read: IAS Transfers: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. 31 మంది అధికారులకు కొత్త పోస్టింగ్‌లు!
చంద్రబాబు సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో పర్యటించి పలు విదేశీ సంస్థలను ఆకర్షించడంలో సఫలీకృతం అయ్యారు. అమెరికాకు చెందిన గూగుల్, బిల్ గేట్స్ ఫౌండేషన్ వంటి సంస్థలతో ఆతిథ్య, ఇంధన, పర్యాటక రంగాల్లో పెట్టుబడులకు చర్చలు జరిపారు. ముఖ్యంగా, విశాఖపట్నంలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ రూ.87,520 కోట్లతో అత్యాధునిక డేటా సెంటర్ నిర్మించనుంది. ఇది దేశంలోనే అతి భారీ పెట్టుబడిగా రికార్డు సృష్టించింది. ఈ సెంటర్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రైడెన్ ఇన్ఫోటెక్, 2020లో స్థాపితమై, భారత డేటా సెంటర్ మార్కెట్లో వేగంగా ఎదిగింది. విశాఖతో పాటు ముంబై, నోయిడాలోనూ ప్రాజెక్టులు చేపడుతోంది. ఈ పెట్టుబడులు ఆరు నెలల్లో గ్రౌండింగ్ ప్రారంభించి, మూడేళ్లలో కార్యకలాపాలు మొదలవుతాయని అంచనా.
అయితే, చంద్రబాబు రియలిస్టిక్‌గా పెట్టుబడులను తెస్తోంటే, గతంలో జగన్ హయాంలో పెట్టుబడుల పేరుతో డమ్మీ ప్రాజెక్టులు మాత్రమే తీసుకొచ్చారు. జగన్ పాలనలో పరిశ్రమలను ఆహ్వానించడం కంటే, పెట్టుబడిదారులను తరిమేసే విధానాన్నే అవలంబించారు. ఉదాహరణకు, అదానీకి డేటా సెంటర్ కోసం భూములు కేటాయించడం వంటి నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు చంద్రబాబు హయాంలో విశాఖను సైబర్ హబ్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతుండగా, కడుపు మంటతో కుట్రలకు తెర తీసింది వైసీపీ. డేటా సెంటర్ల వల్ల నీటి కొరత సమస్య ఉత్పన్నమవుతుందని, పెద్దగా ఉద్యోగాలు కూడా రావని తప్పుడు ప్రచారాలు చేస్తోంది. గూగుల్ వంటి సంస్థలకు మెయిల్స్ పంపి, కేసులు వేసి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. డేటా సెంటర్లకు వాటర్, విద్యుత్ వంటి సౌకర్యాలను సంస్థలే సమకూర్చుకుంటాయని, గూగుల్ రూ.20 వేల కోట్లు ఈ అవసరాల కోసం ఖర్చు చేస్తున్నట్లు డీపీఆర్‌లోనే ఉంది. అయినప్పటికీ, వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలను, యువత భవిష్యత్తును దెబ్బతీసేందుకు అడ్డంకులు సృష్టిస్తోంది. ఇలా వైసీపీ చేస్తోన్న రాజకీయ కుట్రలు రాష్ట్ర పురోగతికి ఆటంకంగా నిలుస్తున్నాయని మండిపడుతున్నారు పరిశీలకులు.