Anantha Urban Politics

Anantha Urban Politics: వివాదాల సుడిగుండం నుండి తిరిగి ఫామ్‌లోకి ఆ ఎమ్మెల్యే!

Anantha Urban Politics: అనంతపురం అర్బన్ నియోజకవర్గ రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఎక్కడైనా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కామన్‌. అయితే ఇక్కడ మాత్రం టీడీపీ వర్సెస్ టీడీపీ, అలాగే వైసీపీ వర్సెస్‌ వైసీపీ అన్నట్లు ఉంటుంది. ఒకే పార్టీలో ఉంటూ రాజకీయ విమర్శలు ఏంటి అనుకుంటున్నారా? అదేనండి ఇక్కడ వెరైటీ. ఈ నియోజకవర్గ ట్రాక్ రికార్డు చూస్తే… 2014లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్సెస్ ఎంపీ దివాకర్ రెడ్డి మధ్య వార్ నడిచేది. 2019 ఎన్నికల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి వర్సెస్ వైసీపీ అర్బన్ నాయకుల మధ్య రాజకీయ రగడ నడిచింది. అయితే 2024 తర్వాత ఈ పరిస్థితి మారింది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరఫున దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. టీడీపీ వర్సెస్ వైసీపీ నాయకుల మధ్య అనంతపురం పట్టణం అభివృద్ధిపైన మాటల యుద్ధమే కొనసాగుతోంది. అభివృద్ధి వర్సెస్ అవినీతి అంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు అనంతపురం అర్బన్‌ నేతలు.

తాజాగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్… మాజీ ఎమ్మెల్యే అనంతపైన ఘాటు విమర్శలు చేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా 30 ఇయర్స్‌ పొలిటికల్ ఇండస్ట్రీ అంటున్న అనంత వెంకటరామిరెడ్డి.. అనంతపురం పట్టణానికి చెప్పుకోదగ్గ పని ఒక్కటైనా చేశారా అంటూ ధ్వజమెత్తారు. అంతటితో ఆగకుండా ఏకంగా దాదాపు 400 ఎకరాలు పైగా అనంత, ఆయన కుటుంబం భూములు వెనకేసుకోలేదా అంటూ ఆరోపించారు. అనంత వెంకటరామిరెడ్డి 30 ఏళ్ల రాజకీయంలో చేసిన అభివృద్ధి సున్నా, సంపాదన మాత్రం ఫుల్ అంటూ తీవ్రమైన విమర్శలు చేశారు. అంతే… వైసీపీ నాయకులు కూడా టీడీపీపైన, ఎమ్మెల్యేపైన తీవ్ర విమర్శలకు దిగారు. ఇరువర్గాల పోటాపోటీ ప్రెస్ మీట్‌లు, విమర్శలు, ప్రతివిమర్శలతో అనంతపురం అర్బన్ రాజకీయాలు దద్దరిల్లుతున్నాయి.

Also Read: AP New Districts: ఏపీలో ప్రభుత్వం ప్రతిపాదిస్తోన్న కొత్త జిల్లాలు ఇవే..

అయితే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ రూటు మార్చి తన రాజకీయానికి పదును పెట్టారని చెప్పొచ్చు. జూనియర్‌ ఎన్టీఆర్‌ వివాదంతో సహా మొన్నటివరకు అనేక వివాదాల్లో చిక్కుకున్నారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌. ఇప్పుడు తన పంథాని మార్చుకుని అర్బన్ రాజకీయాల్లో అసలు సిసలైన ఆట మొదలు పెట్టారనిపిస్తోంది. ఒకవైపు తనని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ప్లాన్లు వేస్తున్న వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తూ, మరోవైపు పార్టీలో అంతర్గత విభేదాలను అధిగమిస్తూ తన రాజకీయ మార్క్ ఏంటో చూపిస్తున్నట్లు అర్థమౌతోంది. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెడుతూ, అదే సమయంలో గత ఐదేళ్లలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యేతో పాటు, మున్సిపల్ మేయర్, కార్పొరేటర్ల అవినీతిపై నిప్పులు చెరుగుతున్నారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు, మేయర్‌కు మధ్య ఒక రకంగా భీకరమైన మాటల యుద్ధమే జరుగుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు నాలుగు నెలల్లో లోకల్ బాడీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే అనంతపురం అర్బన్ మేయర్ పీఠంపై అధికార పార్టీ కన్నేసింది. 50 డివిజన్లలో టీడీపీ బలమైన శక్తిగా ఎదగాలని ఎమ్మెల్యే పట్టుదలగా ఉన్నారట. ఈ నేపథ్యంలో రాజుకున్న రాజకీయ వేడి స్థానిక మున్సిపాలిటీ ఎన్నికల వరకూ కొనసాగే అవకాశాలున్నాయి. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌కి తోడుగా టీడీపీ క్యాడర్‌ ఏకతాటిపైకి రావడం ఆ పార్టీకి కలిసొస్తోంది. వైసీపీ మాత్రం రోజురోజుకీ బలహీనపడుతూ దూకుడు రాజకీయాలు చేయలేకపోతున్నారని తెలుస్తోంది. మరి మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీని వైసీపీ ధీటుగా ఎదుర్కోగలదా? అనంతపురం అర్బన్‌లో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇదే చర్చించుకుంటున్నారట. మరి ఎవరి బలం ఏంటో తెలియాలంటే స్థానిక ఎన్నికల వరకు ఆగాల్సిందే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *