Janamloki Janasena: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దసరా తర్వాత ప్రజల్లోకి రానున్నారు. ఈ ఏడాది జూలైలోనే గ్రామాలు, పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తానని ప్రకటించినా, వివిధ కారణాలతో ఆ ప్రణాళిక వాయిదా పడింది. పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వస్తున్న ఒత్తిడి, ప్రజల్లో వ్యక్తమవుతున్న డిమాండ్ నేపథ్యంలో అక్టోబర్ తొలి వారంలో పవన్ స్వయంగా రోడ్డెక్కనున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు సరైన ప్రచారం లేకపోవడంతో జనసేనకు ఆశించిన మైలేజీ రావడం లేదని పవన్ భావిస్తున్నారు. విశాఖలో జరిగిన “సేనతో సేనాని” కార్యక్రమంలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి పనులు, గిరిజన గ్రామాల్లో విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన కొనసాగుతున్నా, వీటి గురించి ప్రజలకు సమాచారం అందడం లేదు. ప్రజల్లో చర్చ జరగడం లేదు. దీంతో, నేరుగా ప్రజలతో మమేకమై, అభివృద్ధి పనులను వివరించాలని పవన్ నిర్ణయించారు.
Also Read: BJP: రాజకీయాల్లోకి వరుణ్ సందేశ్ తల్లి!
దసరా తర్వాత ప్రారంభమయ్యే ఈ పర్యటనలో ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రచారం, కోటి మొక్కల నాటకం కార్యక్రమం, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం వంటి అంశాలు ఉంటాయి. తాను స్వయంగా కదిలితేనే పార్టీకి ఊపు వస్తుందని గ్రహించిన పవన్, ఈ దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జనసేనకు కీలకం. గతంలో పోటీ చేయకపోయినా, స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యంలో, మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ చర్యలు తీసుకుంటున్నారు. దీంతో దసరా తర్వాత జనసేన కొత్త ఊపుతో కనిపించనుంది. క్యాడర్‌కి ఇచ్చిన త్రిశూల్ హామీ మీద కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దసరా తర్వాత త్రిశూల్ విధి విధానాలు ఖరారయ్యే అవకాశం ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రజలతో నేరుగా కలిసే ప్రయత్నం ద్వారా పార్టీకి అవసరమైన గుర్తింపు, మద్దతు పెరిగే అవకాశం ఉందని జనసేన వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.