Baby Delivery with Whatsapp: పురుటి నొప్పులతో బాధపడుతున్న తన భార్యను ఆసుపత్రికి తరలించకుండా ఇంట్లోనే బిడ్డను ప్రసవించేందుకు ఓ వ్యక్తి సహకరించిన ఘటన చెన్నైలోని కుండ్రత్తూరు సమీపంలో కలకలం రేపింది. అతను వాట్సాప్ గ్రూప్ నుండి సాంప్రదాయ ప్రసవ పద్ధతులకు సంబంధించిన సమాచారాన్నితీసుకుంటూ ఈ పని చేశాడు. అతని భార్య ఆరోగ్యకరమైన మగబిడ్డను ప్రసవించిన తర్వాత, ఆ వ్యక్తి ఈవెంట్ వివరాలను వాట్సాప్ గ్రూప్‌లో పంచుకున్నాడు. దీంతో ఈ వార్త ఆరోగ్య శాఖకు చేరింది. దీనిని చూసిన అధికారులు ఆ వ్యక్తిపై ఫిర్యాదు నమోదు చేశారు. సంఘటన వివరాల్లోకి వెళితే..
Baby Delivery with Whatsapp: తిరువణ్ణామలైకి చెందిన మహేంద్రన్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కుండ్రత్తూరు సమీపంలోని నందంపాక్కంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అదే ప్రాంతంలో పొక్లెయిన్ మెషిన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మహేంద్రన్‌కు సుగన్య (32)తో వివాహమైంది. వారికి 8 , 4 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుగన్య మూడోసారి గర్భం దాల్చింది. డెలివరీ సమయం దగ్గరకు వచ్చినా వైద్య పరీక్షలు చేయించుకోలేకపోయింది. ఈ క్రమంలో ఆమె ప్రసవవేదనకు గురై ఈ నెల 17న మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా.. ఇంటిలోనే వాట్సాప్ గ్రూప్ లో డెలివరీ ఎలా చేయాలనే విషయాలపై సమాచారం తీసుకుంటూ తన భార్యకు ప్రసవం అయ్యేలా చేశాడు. మహేంద్రన్ అదే వాట్సాప్ గ్రూప్‌లో డెలివరీ వివరాలను కూడా పంచుకున్నాడు. ఈ విషయం కుండ్రత్తూరులోని స్థానిక ఆరోగ్యశాఖ అధికారులకు తెలియడంతో వారు విచారణ ప్రారంభించి కుండ్రత్తూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Baby Delivery with Whatsapp: దీంతో పోలీసులు మహేంద్రన్‌ను విచారించి అతడి ఫోన్‌ను పరిశీలించారు. అతను “ఇంట్లోనే డెలివరీ అయిన అనుభవం” అనే వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నట్లు తెలిసింది. ఈ గ్రూప్ లో 1,024 మంది సభ్యులు ఉన్నారు. ఇంటిలోనే ప్రసవం కావడానికి సంబంధించిన సమాచారం, ఫోటోలతో అనేక పోస్ట్‌లు ఉన్నాయి. మహేంద్రన్ తన భార్య డెలివరీకి సహకరించేందుకు ఈ సమాచారాన్ని ఉపయోగించినట్లు కూడా తేలింది.
Baby Delivery with Whatsapp: సుగన్య – నవజాత శిశువు ఆరోగ్యంగా ఉన్నందున, పోలీసులు మహేంద్రన్‌ను హెచ్చరికతో విడిచిపెట్టారు. ఇంట్లో డెలివరీ చేయడం వలన కలిగే ప్రమాదాల గురించి అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఫిర్యాదు చేసిన స్థానిక వైద్యాధికారి ప్రసవానికి సంబంధించిన సరైన విధానాలపై మహేంద్రన్‌కు సూచనలు ఇచ్చారు.
తల్లి, బిడ్డకు అవసరమైన వైద్య సహాయం అందేలా చూస్తామని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇలాంటి ప్రమాదకరమైన పద్ధతులకు పాల్పడవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి చర్యలకు ప్రయత్నించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.