Ayyappa Prasadam: తిరుమల లడ్డు కోసం వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలతో కొన్నిరోజులుగా గందరగోళం రేగుతున్న విషయం తెలిసిందే. అయితే, కేరళలోని ప్రపపంచ ప్రసిద్ధ స్వామి అయ్యప్ప దేవాలయంలో భక్తులు ఎంతో ప్రీతిగా తీసుకునే అరవణ ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గత జనవరి నెలలో అరవణ ప్రసాదంలో ఉపయోగించిన యాలకుల్లో క్రిమిసంహారక అవశేషాలు కనిపించాయి. దీంతో ఆ ప్రసాదాన్ని వినియోగించకుండా నిలిపివేశారు. దానిని బయట పారవేయాలని నిర్ణయించింది ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు. ఎలా పారవేయాలనే నియమాలను రూపొందించింది బోర్డు.
Ayyappa Prasadam: ప్రసిద్ధ మళయాళ మీడియా మనోరమ కథనం ప్రకారం కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలో భక్తులకు నైవేద్యంగా విక్రయించే అరవణ ప్రసాదాన్ని శాస్త్రీయంగా పారవేసేందుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు టెండర్ నోటిఫికేషన్‌ను ఈ మే నెలలో విడుదల చేసింది. జనవరి 2023లో అరవణ తయారీకి ఉపయోగించే ఏలకుల్లో క్రిమిసంహారక మందు ఉన్నట్లు గుర్తించిన హైకోర్టు అరవణ విక్రయాన్ని నిషేధించింది. సన్నిధానంలోని గోడౌన్‌లో అరవణతో కూడిన మొత్తం 6,65,127 కంటైనర్‌లను ఉంచారు. ఈ స్టాక్ విలువ దాదాపు రూ. 5.3 కోట్లు.
Ayyappa Prasadam: నోటిఫికేషన్ ఈ ప్రసాదాన్ని పారవేయడానికి నిర్దిష్ట షరతులను విధించింది. పారవేయడం కోసం పంబా వెలుపల కంటైనర్లను రవాణా చేసిన తర్వాత శాస్త్రీయంగా పారవేయాలి, లేకుంటే అది శబరిమల ప్రాంతంలో అడవి ఏనుగులను ఆకర్షిస్తుంది. ఆ ఏనుగులు దానిని తింటే కనుక వాటి ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, అయ్యప్ప స్వామి చిహ్నాన్ని కలిగి ఉన్న అరవణ కంటైనర్‌లోని భాగాలను బహిరంగంగా పారవేయడంచేయకూడదు. ఎందుకంటే, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని టెండర్ నోటీసులోని షరతుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
అరవణను కాగితంతో తయారు చేసిన కంటైనర్లలో భద్రపరిచారు. ఒక్కొక్కటి 250 ml సామర్థ్యంతో అల్యూమినియం మూతతో సీలు చేస్తారు. కంటైనర్‌ల షెల్ఫ్ లైఫ్ గడువు ముగియడం వల్ల వినియోగించలేని కారణంగా వాటిని చాలా సురక్షితంగా నిర్వహించాలని సూచించారు. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ తమ బాధ్యత, ఖర్చుతో కంటైనర్లను పంబకు, తర్వాత పారవేసే ప్రాంతానికి రవాణా చేయాలని నిర్దేశించారు. అరవణ వినియోగం మంచిది కానందున అది సాధారణ ప్రజలకు చేరకుండా చూసుకోవాల్సిన బాధ్యత టెండర్ సాధించిన వారిదే అవుతుంది. ఏజెన్సీ ఈ ప్రసాదాన్ని పారవేసే ప్రదేశంలో ఆరోగ్యం, భద్రత, పర్యావరణ (HSE) అవసరాలను అనుసరించాలి. పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి చర్యల అమలును నిర్ధారించాలి. సంబంధిత స్థానిక సంస్థ అవసరాలకు కట్టుబడి ఉండేలా చూసుకోవాలి.
Ayyappa Prasadam: ఇంత పెద్ద మొత్తంలో ప్రసాదం పారవేయడం ఇదే తొలిసారనీ, అందుకే శాస్త్రీయ పద్ధతులను అన్వేషిస్తున్నామని ప్రాజెక్టు అధికారి ఒకరు తెలిపారు. ”పని పరిమాణం కారణంగా మేము నిర్దిష్ట షరతులను విధించాము. మాకు ప్రసాదాన్ని పెద్ద మొత్తంలో పారవేయాల్సి ఉంది. ఇది ఏనుగులను ఆకర్షించకుండా లేదా మతపరమైన మనోభావాలను దెబ్బతీయని విధంగా చేయాలి. ప్రతిపాదనలు అందిన తర్వాత పారవేయడానికి అవసరమైన ఖర్చును ఖరారు చేయాల్సి ఉంటుంది’’ అని ఆ అధికారి చెప్పారు.
2023లో, క్రిమిసంహారక మందులతో కూడిన అరవణాన్ని విక్రయించడాన్ని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించిన తర్వాత ఏలకులు లేకుండా అరవణను పంపిణీ చేయాలని TDB నిర్ణయించింది. ఆ తర్వాత పాతబడిపోయిన అరవణ నిల్వలను పారవేసేందుకు సుప్రీంకోర్టు బోర్డుకు అనుమతి ఇచ్చింది. తీర్థయాత్రల సమయంలో కేరళ, పొరుగు రాష్ట్రాల నుండి ఏటా లక్షలాది మంది భక్తులు శబరిమలను సందర్శిస్తారు.
ప్రసాదం విషయంలో కేరళలోని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఎంత జాగ్రత్తలు తీసుకుంటుంది వివరించడం కోసం ఈ విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కల్తీ జరిగింది అని తెలిసిన వెంటనే.. ఆ ప్రసాదాన్ని బయట పారవేయాలని నిర్ణయించారు. అలాగే, పారవేయడానికి కూడా చాలా జాగ్రత్తలు పాటించారు.