Bihar: భారత్ లో వందే భారత్ రైళ్లపై దాడి కొనసాగుతూనే ఉంది.తాజాగా మరో రెండు రైళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు బీహార్ రాష్ట్రం గయా లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను ఆర్‌పీఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 20894 నంబర్‌గల పాట్నా టాటా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గయా స్టేషన్ నుంచి బయల్దేరింది. మన్పూర్ రైల్వే సెక్షన్ సమీపంలోకి రాగానే ఈ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు.
అదేవిధంగా 22304 నంబర్ గల గయా-హౌరా వందే భారత్‌పై కూడా రాళ్ల దాడి చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న గయా ఆర్పీఎఫ్ ప్రత్యేక బృందం ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించింది.ఘటనపై అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ రామ్‌సేవక్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా సెక్షన్ 153, 147 రైల్వే యాక్ట్ కింద గయాలో కేసు నమోదైంది.
విచారణ చేపట్టిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్.. దాడికి పాల్పడింది మన్పూర్ వాసులు వికాస్ కుమార్ (20), మనీష్ కుమార్ (20)గా గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించారు. తాము మరిన్ని రైళ్లను కూడా టార్గెట్ చేయబోతున్నట్లు విచారణలో బయటపెట్టారు. దీంతో అప్రమత్తమైన ఆర్‌పీఎఫ్ సిబ్బంది రైళ్లపై రాళ్ల దాడులను నివారించారు.