Chandrababu: తమిళనాడులో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెన్నైలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్డీయే (NDA) కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, మహిళా రిజర్వేషన్లు ఇంకా కేంద్ర నిధుల వినియోగంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
మహిళా రిజర్వేషన్లపై సుదీర్ఘ పోరాటం
తన 48 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జరిగిన ప్రయత్నాలను వివరించారు. “నేను యూనైటెడ్ ఫ్రంట్ (UF) కన్వీనర్‌గా ఉన్నప్పుడు దేవెగౌడ గారు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వాజ్ పేయి హయాంలో, యూపీఏ హయాంలో కూడా ప్రయత్నాలు జరిగాయి. చివరకు 2023లో ప్రధాని మోదీ హయాంలో ఈ బిల్లు ఆమోదం పొందింది” అని ఆయన గుర్తు చేశారు. అయితే, మహిళా రిజర్వేషన్ల అమలును అడ్డుకోవడం వల్ల సమాజానికి ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) విషయంలో అభ్యంతరాలు ఉంటే ప్రత్యామ్నాయాలు చెప్పాలి తప్ప, బిల్లును అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు.
దక్షిణాది అభివృద్ధి – కేంద్రం సహకారం
దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ వల్ల జనాభా తగ్గినా, తలసరి ఆదాయం పెరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. కోయంబత్తూరు వంటి నగరాలు ఒకప్పుడు పారిశ్రామిక హబ్‌లుగా ఉండేవని, వాటికి పూర్వవైభవం రావాలంటే కేంద్రంతో కలిసి పనిచేసే ప్రభుత్వం ఉండాలని చెప్పారు. “సంక్షేమం కోసం చెన్నైకి కేంద్రం రూ.14 లక్షల కోట్లు ఇచ్చింది. జాతీయ రహదారుల నిర్మాణానికి కూడా భారీగా నిధులు వస్తున్నాయి. కేంద్రం ఇచ్చే నిధులను దారిమళ్లించడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది” అని ఆయన విమర్శించారు.
బుల్లెట్ స్పీడ్ గ్రోత్ కావాలంటే..
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే బుల్లెట్ స్పీడ్ గ్రోత్ ఉంటుంది. ఏపీకి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం వాటా దక్కిందంటే అది డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే సాధ్యమైంది” అని చంద్రబాబు స్పష్టం చేశారు. సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడే రాష్ట్రాలకు పెట్టుబడులు వస్తాయని, తమిళనాడు ప్రజలు సరైన సమయంలో మంచి ఆలోచన చేసి ఎన్డీయే కూటమిని గెలిపించాలని కోరారు. మోదీ వంటి దార్శనికత కలిగిన నాయకుడితోనే దేశానికి, రాష్ట్రాలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆయన పిలుపునిచ్చారు.
తమిళనాడు సంస్కృతికి మూలమైన ద్రావిడ భాషలు, ఇక్కడి మేధోసంపత్తిని ప్రపంచం గుర్తిస్తోందని, ఆ స్థాయికి తగ్గట్టుగా అభివృద్ధి జరగాలంటే రాజకీయ సుస్థిరత అవసరమని ఆయన ముగించారు.
