Telangana: రాష్ట్రంలోని వివిధ సంక్షేమ హాసళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కేసులు వరుసగా నమోదవుతున్నాయి. నిన్న ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో, మొన్న మాగనూరులో ఫుడ్ పాయిజన్‌తో వంద మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికీ వాంకిడి విద్యార్థులు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో మరో పాఠశాలలో విద్యార్థులు విషాహారం తిన్న ఘటన ఆందోళన కలిగిస్తున్నది.
Telangana: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూర్గుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని, ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా వాంతులు చేసుకున్నారు. మరో 20 మందికి పైగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. విషయం తెలిసిన ఉపాధ్యాయులు ప్రభుత్వ వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు వారు విద్యార్థులకు చికిత్స అందజేస్తున్నారు.
Telangana: ఇదిలా ఉండగా, బూర్గుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వండిన బియ్యం కొత్తవి కావడంతోపాటు అన్నం మెత్తగా కావడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని మండల విద్యాధికారి వివరణ ఇచ్చారు. అయితే ఇది కాదని, అన్నం, కూరల్లో ఏదో జరిగి ఉంటుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా వరుస ఫుడ్ పాయిజన్ కేసులతో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.