Dwaraka Tirumala: ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 20 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారు శ్రీ మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లను ఆలయ అర్చకులు పెండ్లికొడుకు, పెండ్లి కూతుర్లుగా అలంకరణ చేశారు.
ముందుగా ఆలయ నిత్య కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంపై ఉంచి అలంకరణ చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మ వార్ల ఉత్సవ మూర్తులకు హారతులు పట్టి, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ స్వామి అమ్మవార్లను పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లుగా అలంకరించి ముస్తాబు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్ వి ఎస్ ఎన్ మూర్తి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.