తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం భక్త ప్రపంచంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ విషయంలో తమ నిరసన తెలియచేశారు. జరిగిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ నెయ్యిలో కల్తీపై స్పందించారు. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో అత్యంత బాధను రేపింది ఆయన అన్నారు. ఈ ఘటన చూస్తుంటే.. బ్రిటిష్ కాలంలో 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు వెనుక ఉన్న విషయాలు జ్ఞప్తికి వస్తున్నాయని చెప్పారు.
ఇలాంటి దారుణ ఘటనలను మామూలుగా తీసుకోకూడదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనసులను గాయపరిచిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా, దీనికి బాధ్యులైన వారి ఆస్తులను జప్తు చేయాలని సూచించారు. ఆలయాల నిర్వహణ బాధ్యతలు సాధువులు, ఆధ్యాత్మిక గురువులకు అప్పగించాలని రవిశంకర్ డిమాండ్ చేశారు. అలాగే, ఒక్క లడ్డు అనే కాకుండా దేవాలయాల్లో ఇతర ఉత్పత్తుల్లో కల్తీలు జరుగుతున్నాయా? అనే విషయంపైనా కూడా విచారణ జరిపించాలన్నారు. మార్కెట్లో దొరుకుతున్న నెయ్యి విషయంలో కూడా తనిఖీలు చేయాలని చెప్పారు. ఆహారాన్ని కల్తీ చేసి నాన్ వెజ్ పదార్ధాలను కలుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ రవి శంకర్ గట్టిగ డిమాండ్ చేశారు.