Turmeric: భారతీయ వంటకాల్లో శతాబ్దాలుగా ఉపయోగించే పసుపు (Turmeric) కేవలం మసాలా దినుసు కాదు, ఔషధ గుణాల గని అని అందరికీ తెలుసు. ఇది ఆహారానికి రంగు, రుచి ఇవ్వడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి శరీరంలో వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే, ఈ బంగారు మసాలాను ఎక్కువగా వాడితే కాలేయం (Liver), మూత్రపిండాలు (Kidneys) దెబ్బతింటాయనే అపోహలు చాలా మందిలో ఉన్నాయి. దీనిపై నిపుణులు కీలక వివరాలు వెల్లడించారు.
కాలేయంపై పసుపు ప్రభావం: మితంగా వాడితే సురక్షితం
హార్వర్డ్‌లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథ్ ప్రకారం, పసుపును సరైన మోతాదులో వాడితే కాలేయానికి ఎటువంటి ప్రమాదం లేదు, పైగా ప్రయోజనకరమే.
డాక్టర్ సేథ్ తన క్లినిక్‌లో తరచుగా ఈ సందేహాలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం ఫ్యాటీ లివర్ వ్యాధి ఉన్నవారిలో వాపును తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు చూపించాయి.
ఆహారంలో కూరగాయలు, టీ లేదా పాలతో కలిపి అర టీస్పూన్ నుండి ఒక టీస్పూన్ వరకు పసుపు తీసుకోవడం పూర్తిగా సురక్షితం. ఇది కాలేయంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు.
అయితే, సమస్యల్లా అధిక మోతాదులో పసుపు సప్లిమెంట్లు తీసుకున్నప్పుడే వస్తుంది. అధిక మోతాదులో సప్లిమెంట్లు తీసుకోవడం కాలేయానికి హానికరమని నిరూపించబడిన సందర్భాలు ఉన్నాయి.
Also Read: Sprouts: మొలకలు ఎప్పుడు తింటే ఎక్కువ ప్రయోజనం? సరైన సమయం ఇదే!
మూత్రపిండాలు, రక్తంపై ప్రమాదం: అతిగా వాడొద్దు!
పసుపు కాలేయానికి మేలు చేసినా, కొన్ని పరిస్థితుల్లో మూత్రపిండాలకు (కిడ్నీలకు), రక్తానికి ప్రమాదకరంగా మారవచ్చు.
కిడ్నీలో రాళ్లు (Kidney Stones): పసుపులో ఉండే కర్కుమిన్ కారణంగా యూరిన్‌లో ఆక్సలేట్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. ఇప్పటికే కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు తరచుగా పసుపు తీసుకుంటే సమస్య మరింత పెరుగుతుంది.
రక్తం పలుచబడటం: పసుపు వల్ల రక్తం పలుచబడే గుణం ఉంది. కాబట్టి, ఇప్పటికే బ్లీడింగ్ సమస్యలు ఉన్నవారు లేదా రక్తం గడ్డకట్టడానికి మందులు (Blood Thinners) వాడుతున్న వారు పసుపును అధికంగా తీసుకుంటే ప్రమాదం. ఇది రక్తం మరింత పలుచబడటానికి దారితీసి, బ్లీడింగ్‌ను పెంచుతుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నందున మితంగా వాడితే జీర్ణ శక్తిని, ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది. కానీ, దానిని అతిగా వాడటం లేదా వైద్య సలహా లేకుండా అధిక మోతాదులో సప్లిమెంట్లు తీసుకోవడం ప్రమాదకరం.