Kannappa: మంచు విష్ణు నటిస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ తాజాగా మళ్లీ వివాదాల్లో చిక్కుకుంది. శైవ భక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ హిస్టారికల్ సినిమా పాన్-ఇండియా స్థాయిలో నిర్మితమవుతోంది. అయితే షూటింగ్ మొదలైనప్పటి నుంచి పలుమార్లు ఆలస్యం, హార్డ్ డిస్క్ చోరీ, విడుదల తేదీల మార్పులతో వార్తల్లో నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటోంది.
బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసేలా.. అంటూ పిటిషన్
ఈ సినిమాలో బ్రహ్మానందం, సప్తగిరి నటించిన ‘పిలక’, ‘గిలక’ అనే పాత్రల పేర్లు బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సనాతన ధర్మాన్ని అవమానించేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, చరిత్రను వక్రీకరించారని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూన్ 17న (మంగళవారం) హైకోర్టు ఈ కేసును విచారించింది.
సెన్సార్ లేకుండానే విడుదల ప్రకటనపై హైకోర్టు ఆగ్రహం
కన్నప్ప సినిమా ఇంకా సెన్సార్ పూర్తి కాకముందే, సినిమాను జూన్ 27న విడుదల చేస్తామంటూ మీడియా ప్రకటనలు రావడం పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. CBFC (సెన్సార్ బోర్డు) తరపున హాజరైన అడ్వకేట్ నుంచి కౌంటర్ సబ్మిట్ చేయకపోవడం, ఇతర ప్రతివాదులు హాజరుకాకపోవడం పట్ల కోర్టు మండిపడింది. కోర్టు అనుమతి లేకుండా సినిమా విడుదల చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Kannappa: ‘కన్నప్ప’ సినిమాకు సెన్సార్ అడ్డంకులు!
సినిమా విడుదలపై అనిశ్చితి
ఈ సినిమా జూన్ 27న విడుదల కానుందని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. కానీ అదే రోజు హైకోర్టులో విచారణ జరగనుండటంతో సినిమా విడుదలపై అనేక అనిశ్చితులు నెలకొన్నాయి. సెన్సార్ అనుమతులు లేకుండా విడుదలపై నిబంధనలు ఉల్లంఘించినట్లైతే, సినిమా ఆపేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
తారాగణం, సాంకేతిక బృందం మెరుగ్గా ఉన్నా…
ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన “మహాభారతం” టీవీ సీరీస్‌కి దర్శకత్వం వహించి మంచి గుర్తింపు పొందారు. మోహన్ బాబు, మంచు విష్ణు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ (రుద్ర), అక్షయ్ కుమార్ (శివుడు), కాజల్ అగర్వాల్ (పార్వతి), మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, బ్రహ్మానందం, సప్తగిరి, ప్రీతి ముకుందన్, మధుబాల, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
వివాదాలు పెరిగితే ‘కన్నప్ప’ విడుదలకు ముప్పే
సినిమా కథపై, పాత్రలపై బ్రాహ్మణ సంఘాల అభ్యంతరాలు, సెన్సార్ లేకుండా విడుదల ప్రకటన కారణంగా కన్నప్ప సినిమా ప్రశాంతమైన విడుదల కంటే కానూను సమస్యల మధ్య నడుస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇక జూన్ 27న విడుదల అవుతుందా లేదా అన్నది హైకోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉంది.