ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యావసర వస్తువైన నూనెల ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్న క్రమంలో పేదలకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇవాళ్టి నుంచి రేషన్ షాపుల్లో డిస్కౌంట్ ధరలకే వీటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది.ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.పామాయిల్ లీటర్ 110 రూపాయలకు, సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ 124 రూపాయలకే అందించనున్నారు. రేషన్ కార్డ్ ఆధారంగా పామాయిల్ మూడు ప్యాకెట్లు, సన్ఫ్లవర్ ఆయిల్ ఒక ప్యాకెట్ మాత్రమే అమ్మబోతున్నారు.
వంట నూనె ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇలా డిస్కౌంట్ ధరలపై నూనెల్ని అమ్మాలని నిర్ణయించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.విజయవాడ సివిల్స్ సప్లయిస్ భవన్ లో వంట నూనె సరఫరాదారులు, డిస్ట్రిబ్యూటర్లు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వర్తకులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. ఇందులో అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా ధరల నియంత్రణ, వర్తకుల సమస్యలపై చర్చించారు.
ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం వంటనూనెల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో వంటనూనె అమ్మకములో వ్యత్యాసం లేకుండా ఒకే ధరకు అమ్మకం జరపాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.