AP Kabaddi Association: ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ (ఏకేఏ)లో ఇటీవల జరిగిన అవకతవకలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు కె.ఈ. ప్రభాకర్, మాజీ కార్యదర్శి వీర్లంకయ్యలను పదవుల నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. వీర్లంకయ్యపై రూ.7,12,510 నిధుల దుర్వినియోగానికి సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తాన్ని వడ్డీతో సహా ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.
అలాగే, తప్పుడు జనన ధృవీకరణ పత్రం, తప్పుడు కబడ్డీ క్రీడాప్రతిభ పత్రాలతో పోస్టల్ శాఖలో ఉద్యోగం పొందిన విశాఖకు చెందిన సత్యనారాయణను ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రభుత్వం సూచించింది. ఈ పరిణామాల నేపథ్యంలో, కబడ్డీ అసోసియేషన్‌లో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని, రాజకీయ ప్రభావం లేకుండా క్రీడా సంఘాలు పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Also Read: MP Shashi Tharoor: కాంగ్రెస్‌కు థరూర్ గుడ్‌బై?.. బీజేపీలో చేరనున్నారా?.. ఎంపీ సమాధానం ఇదే
AP Kabaddi Association: ఇటీవల, ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేశారు. ఈ ఎన్నికల్లో ప్రభావతి అధ్యక్షురాలిగా, కృష్ణ వైస్ ప్రెసిడెంట్‌గా, యలమంచిలి శ్రీకాంత్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు ఏకేఐఎఫ్ మార్గదర్శకాలకు అనుగుణంగా, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, ఏకేఐఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అన్వేష్ పర్యవేక్షణలో జరిగాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు కబడ్డీ క్రీడలో పారదర్శకతను పెంచి, క్రీడాకారులకు న్యాయం చేయడంలో కీలకంగా నిలవనున్నాయి.

