AP Excise Policy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీని ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఈ పాలసీలో ఎన్నో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త విధానం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. వచ్చే మూడేళ్ల పాటు ఈ పాలసీని అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పనివేళల్లో కూడా భారీ మార్పులు తీసుకొచ్చింది.
AP Excise Policy: గతంలో బార్లను వేలం ద్వారా కేటాయించారు. ప్రస్తుతం లాటరీ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. నూతన పాలసీ ప్రకారం.. కల్లు గీత కార్మికుల కోసం మరో 84 బార్లకు మరో నోటిఫికేషన్ జారీచేశారు. లాటరీ పద్ధతిని కేటాయించాలంటే.. ఒక్కో బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు రావాలనే నిబంధనను విధించారు.
AP Excise Policy: బార్ల పనివేళలను ప్రభుత్వం ఇక నుంచి రెండు గంటల పెంపునకు అనుమతి ఇచ్చింది. గతంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బార్లు తెరిచి ఉండేందుకు అనుమతి ఉండేది. నూతన పాలసీలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు పనిచేసేలా అనుమతులు ఉంటాయి.
AP Excise Policy: దరఖాస్తు రుసుము నాన్ రిఫండబుల్ ఫీజు రూ.5 లక్షలు, అదనంగా మరో రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు ప్రతిఏటా 10 శాతం పెరుగుతుందని నూతన పాలసీలో పొందుపర్చారు. గీత కార్మికులకు మాత్రం లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ కల్పించారు. కొత్తగా ప్రవేశ పెట్టిన రూ.99 క్వార్టర్ మద్యాన్ని బారల్లో విక్రయించడానికి అనుమతిని లేకుండా చేసింది.
AP Excise Policy: లైసెన్స్ ఫీజును మూడు కేటగిరీలుగా ప్రభుత్వం విభజించింది. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.35 లక్షలుగా నిర్ధారించింది. అదే విధంగా 50,000 నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో ఫీజును రూ.55 లక్షలుగా, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఫీజును రూ.75 లక్షలుగా ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీలో నిర్ధారించింది.
AP Excise Policy: కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం విమానాశ్రయాల్లోనూ బార్ల ఏర్పాటుకు అనుమతి ఇస్తారు. ఈ మేరకు త్వరలో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేస్తారు. దరఖాస్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో స్వీకరిస్తారు. రాష్ట్రంలో అన్ని చోట్ల అవకాశం కల్పించినా, ఒక్క తిరుపతిలో బార్ల ఏర్పాటుకు అనుమతి లేకుండా చేశారు. తిరుపతి పవిత్రతను కాపాడేందుకు తిరుపతి విమానాశ్రయంలో బార్లకు అనుమతి నిబంధన నుంచి మినహాయించారు.