CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జీఎస్టీ 2.0 సంస్కరణలపై రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొంటూ, దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో సంస్కరణల పాత్ర కీలకమని ఉద్ఘాటించారు. కేవలం అప్పులు చేసి సంక్షేమం అందించడం సరికాదని, ముందుగా సంపద సృష్టించి, ఆ తరువాతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.
జీఎస్టీ ఒక విప్లవాత్మక మార్పు:
దేశ ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) ఒక గేమ్‌ఛేంజర్‌గా మారిందని చంద్రబాబు గారు అభివర్ణించారు. వాజ్‌పేయి గారి హయాంలోనే జీఎస్టీని తీసుకురావాలనే ఆలోచన మొదలైందని, ఆ తరువాత ప్రధాని మోదీ ప్రభుత్వంలో అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా దాన్ని అమలు చేశారని గుర్తుచేశారు. ఈ పన్ను విధానం వల్ల పరోక్ష పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2017లో 65 లక్షల నుంచి ప్రస్తుతం 1.51 కోట్లకు పెరిగిందని ఆయన వివరించారు.
సంస్కరణల ద్వారానే సంపద సృష్టి సాధ్యమని చంద్రబాబు గారు బలంగా నమ్మారు. అభివృద్ధి జరిగితేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, ఆ ఆదాయంతోనే సంక్షేమం, అభివృద్ధి పనులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. “సంపద సృష్టించలేని వారికి సంక్షేమం ఇచ్చే అధికారం లేదు,” అంటూ ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. గతంలో రాష్ట్రాల మధ్య ఉన్న అనేక పన్నుల విధానాలు జీఎస్టీతో తొలగిపోయాయని, ఇది దేశంలోని వ్యాపారులకు, వినియోగదారులకు ఎంతో మేలు చేసిందని ఆయన అన్నారు.
Also Read: Pawan Kalyan: జీఎస్టీ సంస్కరణలకు ఏపీ సంపూర్ణ మద్దతు
కొత్త సంస్కరణల వల్ల కొన్ని స్వల్పకాలిక ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, దేశ ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు గారు నొక్కి చెప్పారు. రాష్ట్రానికి స్వల్ప నష్టం వచ్చినా, భవిష్యత్తు కోసం ఈ సంస్కరణలకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో 99% వస్తువుల ధరలు తగ్గుతాయని, ఇది ప్రజలకు పెద్ద ఊరట అని ఆయన అన్నారు.
ఈ ఏడాది పండుగలను ప్రజలు మరింత ఆనందంగా జరుపుకోవచ్చని, జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని చంద్రబాబు గారు తెలిపారు. ఒకే దేశం, ఒకే పన్ను విధానంతో ప్రజల ఆర్థిక శక్తి పెరుగుతుందని, దీంతో రూ.2 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థలోకి వస్తాయని ఆయన అంచనా వేశారు. ఈ సంస్కరణలు భారతదేశాన్ని ‘డబుల్ ఇంజిన్ గ్రోత్’ సాధించే దేశంగా మార్చగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.