AP Cabinet

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. లక్ష కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్!

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మార్గం సుగమం చేస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు (అక్టోబర్‌ 10, 2025) సమావేశం కానుంది. ఈ కేబినెట్ భేటీలో రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడులకు ఆమోదముద్ర వేయడానికి సిద్ధమవుతోంది.

రూ.1,14,824 కోట్ల పెట్టుబడులు, వేలల్లో ఉద్యోగాలు
మంత్రిమండలి సమావేశంలో మొత్తం రూ.1,14,824 కోట్ల భారీ పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. ఈ పెట్టుబడులు 26 కొత్త ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి రాబోతున్నాయి. వీటి ద్వారా సుమారు 67,218 మందికి పైగా యువతకు కొత్త ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది.

విశాఖలో మెగా డేటా సెంటర్
కేబినెట్ ఆమోదించబోయే ముఖ్యమైన ప్రాజెక్టులలో ఒకటి.. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI)లలో ఒకటిగా భావిస్తున్న రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్. విశాఖపట్నంలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కోసం రూ.87,520 కోట్లను పెట్టుబడి పెట్టడానికి రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

Also Read: AP First In Forign Investments: 20 లక్షల ఉద్యోగాల రికార్డ్‌ బద్ధలు కాబోతోందా?

రాజధానిపై కీలక నిర్ణయాలు
అమరావతిని తిరిగి పునర్నిర్మించే విషయంలో అనేక ముఖ్యమైన నిర్ణయాలు ఈ కేబినెట్‌లో తీసుకోనున్నారు.

రాజ్‌భవన్‌ నిర్మాణానికి ఆమోదం: అమరావతిలో గవర్నర్ నివాసం (రాజ్‌భవన్‌) నిర్మాణానికి రూ.212 కోట్లను కేబినెట్ ఆమోదించనుంది. కృష్ణా నదీ ఒడ్డున ఉన్న అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ప్రాంతంలో దీని నిర్మాణం జరగనుంది.

సీఆర్‌డీఏకు నిధులు: మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం కోసం అవసరమైన నిధులలో 25 శాతాన్ని సీఆర్‌డీఏ (CRDA) ఇచ్చేందుకు కేబినెట్ అంగీకరించనుంది.

నగరాభివృద్ధి మార్పులు: రాజధాని ప్రాంతంలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం, రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో మార్పులు చేసి గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా చర్యలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

క్వాంటం కంప్యూటింగ్ సెంటర్: అమరావతిలో రాబోయే క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి సీఆర్‌డీఏను ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా నియమించడానికి కేబినెట్ ఆమోదం దక్కనుంది.

ఫీజుల మాఫీ: హ్యాపీ నెస్ట్, ఏపీ ఎన్నార్టీ ప్రాజెక్టులకు సంబంధించిన బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

జలవనరులు, ఉద్యోగులు, భూములు
కొండవీడు వాగు దగ్గర నీటి ప్రవాహాన్ని మెరుగుపరచడం కోసం 8400 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం లభించనుంది. ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (DA) అంశంపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే, పలు సంస్థల స్థాపన కోసం అవసరమైన భూ కేటాయింపులపై మంత్రిమండలి నిర్ణయం తీసుకోనుంది. ఈ కేబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో, అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో కీలకంగా మారనున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *