Asia cup 2025: ఆసియా కప్ 2025లో భాగంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రూప్ A మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఆ మ్యాచ్ తర్వాత జరిగిన ఒక సంఘటన ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనం సృష్టించింది. భారత జట్టు ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. ఇది పాక్ ఆటగాళ్లను అవమానించడమేనని పాక్ మీడియాలో హాట్ టాపిక్‌గా వార్తలు వస్తున్నాయి. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో, సూర్యకుమార్ యాదవ్ విన్నింగ్ సిక్స్ కొట్టడంతో, భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లారు.
భారత క్రికెట్ జట్టు ప్రవర్తన పూర్తిగా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ పాకిస్తాన్ జట్టు మేనేజర్ నవీద్ అక్రమ్ చీమా వెంటనే మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు. అయితే ఆసియా కప్ మ్యాచ్ రిఫరీల ప్యానెల్ నుండి ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పీసీబీ చేసిన అభ్యర్థనను ఐసీసీ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.క్రిక్‌బజ్ ప్రకారం.. పీసీబీ వాదనతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఏకీభవించకపోయినట్లు సమాచారం. ఈ ఘటనతో పైక్రాఫ్ట్‌కు సంబంధం లేదని పీసీబీకి ఐసీసీ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.
ఇది కూడా చదవండి: L&T: మెట్రోతో నష్టాలు.. వాటాలను అమ్మేస్తాం
అంతేకాకుండా ఆటగాళ్లు తప్పనిసరిగా హ్యాండ్ షేక్ ఇవ్వాలని ఎంసీసీ మాన్యువల్‌లో లేదు అని ఐసీసీ ప్రతినిథులు పీసీబీ చీఫ్‌కు మెయిల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఐసీసీ అధికారికంగా స్పందించాల్సిన అవసరముంది. మరోవైపు ఆసియా కప్‌లో టీమిండియా సూపర్-4కు దూసుకెళ్లింది. తాజాగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో UAE ఘన విజయం సాధించడంతో భారత్‌కు లైన్ క్లియర్ అయింది. టీమిండియా ఇప్పటికే UAE, పాక్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. మెరుగైన నెట్ రన్‌రేట్(4.793) కారణంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-4కు అర్హత సాధించింది. రెండో బెర్త్ కోసం పాక్, UAE పోటీ పడనున్నాయి.