Telangnana scheme:హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో పథకం అమలుకు రాష్ట్ర సర్కారు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని పూర్తిగా అమలు చేస్తన్నది. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని సగానికి పైగా అమలు చేసింది. నిబంధనల మేరకు ఇంకా కొందరికి చేయాల్సి ఉన్నది. ఇప్పుడు ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. దసరా కానుకగా ఇదేరోజు ఇందిరమ్మ కమిటీల నియామకానికి ఆదేశాలు ఇచ్చింది.
Telangnana scheme:ఈ మేరకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం పంచాయతీల్లో, కార్పొరేషన్, మున్సిపల్ వార్డుల్లో ఇందిరమ్మ కమిటీలను శనివారమే ఏర్పాటు చేసేందుకు ఒకరోజు ముందు జీవో జారీ చేసింది. నియమ నిబంధనలను ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నది. పంచాయతీ స్థాయిలో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్, కార్పొరేషన్లలో కార్పొరేటర్ చైర్మన్‌గా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.
Telangnana scheme:పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు ఆఫీసర్ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ కన్వీనర్‌గా ఉంటారని జీవోలో ప్రభుత్వం పేర్కొన్నది. ఇద్దరు ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యులు, ముగ్గురు స్థానికులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరిలో ఒకరు బీసీ ఉండాలని, మరొకరు ఎస్సీ లేదా ఎస్టీ ఉండాలని పేర్కొన్నది. శనివారమే ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కమిటీల కోసం పేర్లు పంపాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది.
Telangnana scheme:రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ప్రభుత్వ ఆర్థిక సాయం అందించనున్నది. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అవగాహన, సోషల్ ఆడిట్, అధికారులతో సంప్రదింపులు లాంటి బాధ్యతలు ఈ ఇందిరమ్మ కమిటీలు నిర్వహించనున్నాయి. ఇందిరమ్మ కమిటీ సభ్యుల పేర్లను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు నామినేట్ చేస్తూ కలెక్టర్‌కు సిఫారసు చేయాలని, ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ ఆర్డర్లు జారీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Telangnana scheme:ఇప్పటికే వేలాది మంది అర్హులు ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీవో జారీ చేయడంతో వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.