Minister anitha: వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర హోం మంత్రి మేకతోటి అనిత తీవ్రంగా విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు “ముఖ్యమంత్రిని తిడితే బీపీ పెరిగి దాడి చేశారంటూ” చెప్పిన జగన్, ఇప్పుడు వంశీ అరెస్ట్‌పై నీతి కబుర్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆమె అన్నారు.
వంశీ ఒక దళితుడిని భయపెట్టి కిడ్నాప్ చేయించారని అనిత ఆరోపించారు. అంతేకాకుండా, డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినా పోలీసులు కనీస రక్షణ కూడా కల్పించలేకపోయారని ఆమె మండిపడ్డారు. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాతే వంశీని అరెస్ట్ చేసి జైలుకు పంపించామని స్పష్టం చేశారు.
ఈ కేసులో పులివెందుల ఎమ్మెల్యే జగన్ చాలా బాధపడుతున్నారని అనిత వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల కాలంలో టీడీపీ నేతలపై లెక్కలేనన్ని తప్పుడు కేసులు పెట్టారని, తాము కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తే ఇన్ని నెలలు తీసుకునే అవసరం లేదని ఆమె తెలిపారు.
నిందితులకు శిక్షపడే విషయంలో ఆలస్యం జరుగుతోందని, పోలీసు వ్యవస్థ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. న్యాయవ్యవస్థకు గౌరవం ఇవ్వాలంటే, న్యాయవాదులకు కూడా సమాన గౌరవం ఇవ్వాలి, అప్పుడే న్యాయం త్వరగా జరుగుతుందని హోం మంత్రి అనిత వ్యాఖ్యానించారు.