Jr NTR Fans vs MLA Daggubati: అనంతపురం నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన అభిమానులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ ఉద్రిక్తతకు కారణం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఆడియో క్లిప్. అందులో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆగ్రహానికి గురైన ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నివాసం వద్ద ఆదివారం నాడు పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి, భారీగా బలగాలను మోహరించారు. నిరసనకారులు బలవంతంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Also Read: YCP leader in Mydukur: ఆ వైసీపీ నేత వల్ల మైదుకూరు టీడీపీలో లుకలుకలు..
కేవలం అనంతపురంలోనే కాకుండా, అక్కడికి వెళ్తున్న అభిమానులను గుత్తి, పామిడి వంటి ప్రాంతాల్లోని జాతీయ రహదారులపై పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోనూ అభిమానులు నిరసనలకు దిగారు. కొంతమంది అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అంతేకాకుండా, ఒకవేళ ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పని పక్షంలో, ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. ఈ వివాదం కారణంగా అనంతపురంలో ప్రస్తుతం హైటెన్షన్ కొనసాగుతోంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.


