Ananta Sriram: విజయవాడ సమీపంలో ఆదివారం జరిగి హైందవ శంఖారావంకు సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ ప్రచార గీతాన్ని అందించారు. ఇదే వేదికపై నుండి అతను ప్రసంగిస్తూ… సినిమాలలో హైందవ సంస్కృతిని కించపరుస్తూ ఎంతోకాలంగా సినిమాలు వస్తున్నాయని వాపోయారు. ‘కల్కి’లో కర్ణుడిని గొప్పగా చూపించడం అందుకు తాజా తార్కాణంగా పేర్కొన్నారు. హైందవాన్ని తూలనాడే చిత్రాలను ప్రభుత్వాలు నిషేధించడం కంటే ముందు ప్రజలే వాటిని తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఓ సినిమా వ్యక్తిగా సినిమాల్లో హిందుత్వాన్ని కించపరిచి చూడానికి సిగ్గుపడుతున్నానని అన్నారు. ఓ సంగీత దర్శకుడితో ఇలాంటి కారణంగానే తనకు విభేదం ఏర్పడి పదిహేనేళ్ళుగా అతనికి పాటలు రాయడం లేదని చెప్పారు. సమాజహితానికి దోహదం చేసే విధంగా సినిమా పాటను రాయడం విషయంలో ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిని తాను ఆదర్శంగా తీసుకుంటానని చెబుతూ ‘ఒక్కడు’ సినిమా కోసం సీతారామశాస్త్రి రాసిన పాటను వేదికపై అనంత శ్రీరామ్ పాడి వినిపించారు.