Anand Mahindra: కృత్రిమ మేధస్సు (AI) వలన వైట్‌కాలర్ ఉద్యోగాలు తగ్గిపోతాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే, దీన్నకంటే పెద్ద సంక్షోభాన్ని మనం గుర్తించలేకపోతున్నామని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. నైపుణ్యం ఉన్న కార్మికుల కొరతే భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారుతుందని ఆయన తెలిపారు.
ఫోర్డ్ కంపెనీ సీఈఓ జిమ్ ఫార్లే ఇటీవల పేర్కొన్న విషయాన్ని మహీంద్రా ప్రస్తావించారు. ఫోర్డ్‌లో ప్రస్తుతం 5,000 మెకానిక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిలో చాలా ఉద్యోగాలకు సంవత్సరానికి రూ. కోటి కంటే ఎక్కువ వేతనం ఉన్నప్పటికీ భర్తీ కావడం లేదని చెప్పారు. ఇది ఒక్క ఫోర్డ్‌కే పరిమితం కాకుండా, అమెరికాలో ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ట్రక్కింగ్ వంటి రంగాల్లో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు.
గత కొన్ని దశాబ్దాలుగా సమాజం డిగ్రీలు, డెస్క్ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో, నైపుణ్యం ఆధారిత వృత్తులు పట్టించుకోబడలేదని మహీంద్రా విశ్లేషించారు. ఈ రంగాలలో అవసరమైన పనిని ఏఐ చేయలేదని, నైపుణ్యం కలిగినవారికి డిమాండ్ ఏఐ యుగంలో మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ ధోరణి కొనసాగితే, నిర్మాణం నుంచి మరమ్మతుల వరకూ ప్రపంచాన్ని నడిపించే నైపుణ్యం కలిగిన కార్మికులే భవిష్యత్తు విజయవంతులవుతారని మహీంద్రా అన్నారు. ఇది హింస ఆధారంగా కాదు, నైపుణ్యం ఆధారంగా జరుగుతున్న విప్లవమని ఆయన వ్యాఖ్యానించారు.

