Amitabh Bachchan: బాలీవుడ్ అగ్ర నటుడు, బిగ్ బి అమితాబ్ బచ్చన్, తన వ్యక్తిగత బ్లాగులో చేసిన తాజా వ్యాఖ్యలు అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మారుతున్న కాలం, జ్ఞాపకాలు, జీవితంలో మార్పుల గురించి ఆయన రాసిన ‘క్రిప్టిక్ నోట్’ (గూఢమైన సందేశం) చర్చనీయాంశంగా మారింది.
‘కాలం మారుతుంది, ప్రజలు మారుతారు’
అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో ప్రపంచంలో నిరంతరం జరుగుతున్న మార్పులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. “కాలం మారుతుంది, ప్రపంచం మారుతుంది… వైఖరులు, అలవాట్లు, సంస్కృతి మారుతాయి… ప్రజలూ మారుతారు. అప్పుడు ఉన్నవారు ఇప్పుడు లేరు, త్వరలో ‘ఇప్పుడు’ ఉన్నవారు కాలక్రమేణా ‘అప్పటివారు’గా మిగిలిపోతారు” అని ఆయన రాసుకొచ్చారు.
ముఖ్యంగా, ఆయన వయస్సు, జ్ఞాపకశక్తి సమస్యలు ‘వెళ్లే సమయం’ వంటి అంశాల గురించి పరోక్షంగా ప్రస్తావించడం, ఆయన ఆరోగ్య సమస్యలు లేదా తన వృత్తి జీవితంలో రాబోయే మార్పులకు సంకేతం కావచ్చని అభిమానులు భావిస్తున్నారు.
Also Read: The Girlfriend Trailer: ఆసక్తిరేకెత్తిస్తున్న రష్మిక మందన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్
గతాన్ని గురించి ఆలోచించడంలో అర్థం లేదని అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. “జ్ఞాపకాలను జ్ఞాపకాలుగానే ఉండనివ్వండి. వాటి గురించి విలపించడం అనేది మీ వ్యవస్థపై శ్రమతో కూడిన వ్యర్థం అవుతుంది. ‘అప్పుడు’ ఉన్న కాలాన్ని గౌరవించి, ఆనందించండి, వారు అప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు” అని పేర్కొన్నారు.
అలాగే, ఆయన తన తండ్రి, దివంగత కవి హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన కవితా పంక్తులను గుర్తుచేసుకున్నారు. ఆ పాత కవితా పంక్తులు నేటి కాలంలో కూడా ఎంత ఔచిత్యాన్ని కలిగి ఉన్నాయో వివరించారు. ఆయన కవిత్వంలోని దృష్టి, లోతు ఎప్పటికీ మారవని ప్రశంసించారు. బిగ్ బి చేసిన ఈ వ్యాఖ్యలతో ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని, క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు.

