Amit sha: హిందీని కేవలం సంభాషణలు, అధికారిక పనులకే పరిమితం చేయకుండా, సైన్స్, టెక్నాలజీ, న్యాయం, పోలీసు వ్యవస్థ వంటి కీలక రంగాల్లోనూ ప్రధాన భాషగా మార్చాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. హిందీ ఇతర భారతీయ భాషలకు పోటీ కాదని, వాటన్నింటికీ స్నేహిత భాష అని ఆయన స్పష్టం చేశారు.
హిందీ దివస్ సందర్భంగా ఆదివారం జరిగిన ఐదవ అఖిల భారత అధికార భాషా సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. “అన్ని పనులు భారతీయ భాషల్లో జరిగితే ప్రజలతో బంధం మరింత బలపడుతుంది” అని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు తమ మాతృభాషలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని, తాను కూడా అదే భాషలో సమాధానం ఇస్తానని హామీ ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్దంలో భారతీయ భాషలు, సంస్కృతికి పునరుజ్జీవనం లభించిందని ఆయన అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై మోదీ హిందీలో ప్రసంగించడం దేశ భాషల గౌరవాన్ని పెంచిందని గుర్తుచేశారు.
అలాగే ప్రధాని ప్రవేశపెట్టిన ‘పంచ ప్రాణ్’ ప్రతిజ్ఞల్లో భాషలకు కీలక స్థానం ఉందని చెప్పారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉటంకించిన “స్వరాజ్ – స్వధర్మం – స్వభాష” సూత్రం దేశ ఆత్మగౌరవానికి ప్రతీక అని షా పేర్కొన్నారు.
పిల్లల అభ్యాసానికి మాతృభాషే ఆధారం అవుతుందని, వేరే భాషలో నేర్చుకుంటే సామర్థ్యం 30 శాతం వరకు తగ్గుతుందని హెచ్చరించారు. చివరగా, ‘భారతీయ భాషా అనుభాగ్’ ఏర్పాటుతో అధికార భాషా విభాగం ఇప్పుడు పూర్తిస్థాయి శాఖగా మారిందని తెలిపారు.