Mahabubabad: వైద్య శాఖ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఆపదలో ఉన్న వారికి అంబులెన్స్ సేవలు అందడంలో జాప్యం జరిగి, ఒక యువతిని బైక్‌పై ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం, పిన్నిరెడ్డిగూడెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘటన వివరాలు:
పిన్నిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన గూగులోత్ హారిక అనే యువతి బాత్రూమ్ క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కానీ, ఎన్ని సార్లు ఫోన్ చేసినా అంబులెన్స్ సమయానికి రాలేదు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు, నిస్సహాయ స్థితిలో యువతిని బైక్‌పై కూర్చోబెట్టి ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య శాఖ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణలో వైద్య సదుపాయాల పరిస్థితి దారుణంగా ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.