Amarnath Yatra: ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అమర్‌నాథ్ యాత్రను గురువారం (జులై 17, 2025) నాడు తాత్కాలికంగా నిలిపివేశారు. పహల్గామ్, బల్తాల్ బేస్ క్యాంపుల నుండి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. గత 36 గంటల నుంచి లోయలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యాత్రను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. రాబోయే రెండు రోజులు కూడా జమ్మూ కాశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరిక జారీ చేయబడింది. భారీ వర్షాల వల్ల యాత్ర మార్గాల్లో, ముఖ్యంగా బల్తాల్ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో ఒక మహిళా యాత్రికురాలు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల పహల్గామ్, బల్తాల్ మార్గాల్లోని ట్రాక్‌లు దెబ్బతిన్నాయి.
Also Read: Rajasthan: రాజస్థాన్‌లో 9 ఏళ్ల బాలికకు గుండెపోటు!
మార్గాలను పునరుద్ధరించడానికి, అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టడానికి యాత్రను నిలిపివేయాల్సిన అవసరం ఏర్పడింది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడితే శుక్రవారం (జులై 18) నుంచి యాత్ర తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జూలై 3న యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 2.47 లక్షల మందికి పైగా యాత్రికులు 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఈ ఏడాది జమ్మూ నుంచి యాత్ర నిలిపివేయడం ఇదే మొదటిసారి. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.