Amaravati: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో కీలక దశకు శ్రీకారం చుట్టింది. పదేళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు శుక్రవారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. 2015లో మొదలైన కలల రాజధాని ఇప్పుడు మళ్లీ సజీవమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన జరిగిన అమరావతి, ఇప్పుడు తిరిగి నిర్మాణ దిశగా పయనిస్తోంది.
ఇది కేవలం రాజధాని నిర్మాణమే కాదు, ఆంధ్రుల కలల సాకారానికి, రైతుల పోరాటానికి, ప్రజాస్వామ్యానికి విజయగీతం. గత ప్రభుత్వ పాలనలో అడ్డంకులు ఎదురైనప్పటికీ, రైతులు 1,631 రోజులు నిత్యం శాంతియుతంగా పోరాడి, అమరావతి అభివృద్ధికి అండగా నిలిచారు. ఈ సమష్టి ప్రయత్నాల ఫలితమే ఇప్పుడు అమరావతి పునఃఆరంభం.
ప్రభుత్వం తేల్చిచెప్పింది – రాజధాని నిర్మాణానికి రూ.77,250 కోట్లు వ్యయంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇందులో మొదటి దశగా రూ.49,000 కోట్ల పనులకు టెండర్లు ఖరారు కాగా, కేంద్రం, ప్రపంచ బ్యాంక్, ADB లాంటి సంస్థలు రూ.15,000 కోట్లకు పైగా సహాయం చేయనున్నాయి. హడ్కో సంస్థ ద్వారా మరో రూ.11,000 కోట్లు రుణంగా లభించనుంది.
మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం :
అమరావతి అవుటర్ రింగ్ రోడ్ (189 కిమీ) కు రూ.16,310 కోట్లు
రైల్వే లైన్ (ఎర్రుపాలెం – నంబూరు) కు రూ.2,047 కోట్లు
అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు, ప్రపంచ స్థాయి రోడ్లు, పర్యావరణ హిత నివాస ప్రాంతాలు మొదలైనవి ఉన్నాయి.
Also Read: Amaravati Relaunch : జగన్‌కు ప్రభుత్వం ఆహ్వానం – జగన్ నిర్ణయం మీద ఉత్కంఠ.!
పెట్టుబడులు – ఉద్యోగావకాశాలకు పునాది
పలు సంస్థలు అమరావతిలో తమ ఉనికి చాటుతున్నాయి. ఎల్ అండ్ టీ, టీసీఎస్, ఐబీఎం లాంటి దిగ్గజ కంపెనీలు ఐటీ టవర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటు చేస్తుండగా, సీఐఐ భాగస్వామ్యంతో గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నిర్మాణం దిశగా సాగుతున్నాయి.
రైతుల భాగస్వామ్యం – అభివృద్ధికి బలమైన పునాది
చెప్పుకోదగిన విషయం ఏమంటే, 58 రోజుల్లో 34,000 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా సమర్పించారు, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా. భూమి మళ్లీ అభివృద్ధి చేసిన తర్వాత వాటిలో వాటా ఇవ్వడం ద్వారా వారిని భాగస్వాములుగా మార్చారు. ఇది దేశంలో వేరే ఎక్కడా చూడనిది.
Amaravati: అమరావతితో పాటు, ప్రభుత్వం విశాఖపట్నంను ఆర్థిక రాజధానిగా, తిరుపతిని పరిశ్రమల కేంద్రంగా, రాయలసీమను ఆటోమొబైల్ జోన్‌గా అభివృద్ధి చేస్తోంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వేగంగా సాగుతోంది. ఇలా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి దారులు విస్తరించాయి.
వైసీపీ ప్రభుత్వం అమరావతిపై అనేక అనుమానాలు, అవరోధాలు సృష్టించినా – ప్రజల నమ్మకాన్ని, రైతుల సంకల్పాన్ని తట్టుకోలేకపోయింది. 2022లో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాజధానిగా అమరావతి కొనసాగించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇప్పుడు ఆ తీర్పు ఆధారంగా ప్రజల ఆశయాల రాజధాని మళ్లీ నిర్మితమవుతోంది.