Crime News: విజయవాడలో ఓ చిన్న వివాదం పెద్ద దారుణానికి దారితీసింది. ఆర్డర్ ఇచ్చిన దోశ తప్పుగా ఇచ్చారని అడిగిన కస్టమర్‌పై హోటల్ సిబ్బంది కత్తితో దాడి చేసిన సంఘటన నగరంలో కలకలం రేపుతోంది.
ఏం జరిగింది?
శనివారం రాత్రి వైఎస్సార్ కాలనీ సర్కిల్లోని వెల్కమ్ హోటల్‌కు అబ్దుల్ కరీం అనే యువకుడు టిఫిన్ కోసం వెళ్లాడు. ఆయన ఉప్మా దోశ ఆర్డర్ చేసి పార్సిల్‌గా తీసుకెళ్లాడు. అయితే ఇంటికి వెళ్లి చూసినప్పుడు, ఉప్మా దోశ బదులు ప్లెయిన్ దోశ ఇచ్చారని గమనించాడు. వెంటనే తిరిగి హోటల్‌కి వెళ్లి సిబ్బందిని ప్రశ్నించాడు.
గొడవ నుంచి దాడి వరకు
“ఎందుకు తప్పుగా ఇచ్చారు?” అని కరీం అడగడంతో మాటామాట పెరిగింది. ఈ క్రమంలో హోటల్ సిబ్బంది తీవ్ర ఆగ్రహానికి గురై కత్తితో కరీంపై దాడి చేశారు. దీంతో ఆయన గొంతు, మెడ భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తస్రావం అధికంగా ఉండడంతో స్థానికులు, బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యుల చికిత్సతో ప్రాణాపాయం తప్పింది.
ఇది కూడా చదవండి: Crime News: వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తపై ప్రియుడితో కలిసి భార్య మరో రకం దాడి
పోలీసుల దర్యాప్తు
ఈ ఘటనపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒక నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. హోటల్ యజమానులు మాత్రం, “తప్పు జరిగింది, కస్టమర్‌ని దాడి చేయమని మేము చెప్పలేదు” అని వివరణ ఇచ్చారు.
నెటిజెన్ల ఆగ్రహం
సాధారణ టిఫిన్ విషయంలో ఇంతటి దాడి ఎందుకని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. “ఒక దోశ తప్పుగా ఇచ్చారని గొంతు కోయడం ఎక్కడి న్యాయం?”, “మనిషి ప్రాణం విలువ లేకుండా పోతుందా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు.